ప్రధాని మోదీ(PM Modi) ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ(Nidhi Tewari) ఎంపికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పీఎంవోలో డిప్యూటీ సెక్రటరీగా వ్యవహరిస్తున్న నిధి త్వరలో కొత్త బాధ్యతలు తీసుకోనున్నారు. దీంతో ఆమె గురించి నెటిజన్లు ఆరా తీయడం మొదలెట్టారు. ఆమె ఎవరు..? ఏం చదువుకున్నారు..? వంటి వివరాలను సేకరించే పనిలో బిజీగా ఉన్నారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్(IFS) ఆఫీసర్ అయిన నిధి తివారీ వారణాసిలోని మెహముర్‌గంజ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో 96వ ర్యాంక్ సాధించారు. 2014 బ్యాచ్‌కు చెందిన నిధి.. వారణాసిలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్లో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేశారు.
2023 జనవరి 6 నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్నారు. 2022లో అండర్ సెక్రటరీగా చేరారు. పీఎంవోలో చేరడానికి ముందు నిధి తివారీ విదేశాంగ మంత్రిత్వశాఖలో పనిచేశారు. నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో బాధ్యతలు నిర్వర్తించారు. ఫారిన్ అండ్ సెక్యూరిటీకి చెందిన అంశాలను నేరుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు నివేదించడంలో నిధి కీలక పాత్ర పోషించారు. ఆమె నైపుణ్యం పరిగణనలోకి తీసుకుని పీఎం ప్రైవేట్ సెక్రటరీగా నియమించారు. నిధి తివారీ కన్నా ముందు ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీలుగా హార్ధిక్ సతీశ్ చంద్ర షా, వివేక్ కుమార్‌లు విధులు నిర్వహించారు.