Presidential and vice-presidential elections : భారతదేశంలో ఎన్నికలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం). దశాబ్దాలుగా మన ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది ఒక భాగమైపోయింది. కానీ, దేశ అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయానికి వస్తే, ఈ ఆధునిక యంత్రాలకు ప్రవేశం లేదు. ఈ ఎన్నికల్లో ఇప్పటికీ పాత పద్ధతిలోనే బ్యాలెట్ పేపర్లను ఉపయోగిస్తారు. ఎందుకీ వైరుధ్యం..? దేశమంతటా ఎన్నికలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఈవీఎంలను, ఈ కీలక ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉంచుతున్నారు..? ఈవీఎంలలో ఆ సామర్థ్యం లేదా..? లేక దీని వెనుక మరేదైనా సాంకేతిక కారణం దాగి ఉందా..?
ప్రాధాన్యతే అసలు కారణం: ‘దామాషా ప్రాతినిధ్యం’ : సాధారణ ఎన్నికలు ‘ఫస్ట్-పాస్ట్-ద-పోస్ట్’ పద్ధతిలో జరుగుతాయి, అంటే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు గెలిచినట్లు. కానీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ, శాసనమండలి ఎన్నికలు ‘దామాషా ప్రాతినిధ్య’ (Proportional Representation) పద్ధతిలో జరుగుతాయి.
ప్రాధాన్యతా ఓటు: ఈ విధానంలో, ఓటరు (ఎంపీ లేదా ఎమ్మెల్యే) కేవలం ఒక అభ్యర్థికి ఓటు వేయరు. బరిలో ఉన్న అభ్యర్థులకు తమ ప్రాధాన్యత ప్రకారం 1, 2, 3 என ర్యాంకులు ఇస్తారు. అంటే, తమకు బాగా నచ్చిన అభ్యర్థికి 1వ ప్రాధాన్యత, ఆ తర్వాత నచ్చిన వారికి 2వ ప్రాధాన్యత ఇస్తూ ఓటు వేస్తారు.
ఈవీఎంల సాంకేతిక పరిమితి : ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతం మన దేశంలో వాడుతున్న ఈవీఎంలు ‘ఫస్ట్-పాస్ట్-ద-పోస్ట్’ విధానానికి మాత్రమే రూపకల్పన చేయబడ్డాయి.
ఒక ఓటు, ఒక బటన్: ఈవీఎంలో ఒక ఓటరు ఒక అభ్యర్థికి సంబంధించిన బటన్‌ను నొక్కుతారు. ఆ ఓటు ఆ అభ్యర్థి ఖాతాలో నమోదవుతుంది. ఇది కేవలం మొత్తం ఓట్లను, ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చాయో మాత్రమే లెక్కించగలదు.
ప్రాధాన్యతలను గుర్తించలేదు: ఓటర్లు ఇచ్చే విభిన్న ప్రాధాన్యతలను (1, 2, 3…) నమోదు చేసుకుని, వాటి ఆధారంగా సంక్లిష్టమైన లెక్కింపు ప్రక్రియను చేపట్టే సాఫ్ట్‌వేర్ ఈవీఎంలలో లేదు. అందుకే, ఈ ‘దామాషా ప్రాతినిధ్య’ ఎన్నికలకు ఈవీఎంలు సాంకేతికంగా సరిపోవు.
మరి ఓటింగ్ ఎలా జరుగుతుంది : ఈవీఎంలకు బదులుగా, ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా ముద్రించిన బ్యాలెట్ పేపర్లను, ప్రత్యేకమైన పెన్నును ఎన్నికల సంఘం అందిస్తుంది.
పింక్ బ్యాలెట్: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎంపీలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాన్ని ఇస్తారు.
ప్రాధాన్యతల నమోదు: బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల పేర్ల పక్కన ఉన్న ఖాళీ గడిలో, ఓటర్లు తమ ప్రాధాన్యతలను 1, 2, 3 అంకెల రూపంలో నమోదు చేయాలి. కనీసం మొదటి ప్రాధాన్యతను అయినా తప్పనిసరిగా నమోదు చేయాలి.
విప్ వర్తించదు: మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేయలేవు. ప్రతి సభ్యుడు తమ అంతరాత్మ ప్రబోధం మేరకు ప్రాధాన్యతలను ఎంచుకోవచ్చు.
ఈవీఎంల తొలి అడుగు.. ఓ వివాదం : భారత్‌లో ఈవీఎంలను తొలిసారిగా 1982లో కేరళలోని పరవూర్ అసెంబ్లీ ఎన్నికలో ఉపయోగించారు. ఆ ఎన్నికలో కేవలం 123 ఓట్ల తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఏసీ జోస్, ఈవీఎంల వినియోగాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో ఈవీఎంల వాడకానికి చట్టబద్ధత లేదని పేర్కొంటూ, సుప్రీంకోర్టు ఆ ఎన్నికను రద్దు చేసి, బ్యాలెట్ పేపర్‌తో రీ-పోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఆ తర్వాత, 1989లో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి, ఎన్నికల్లో ఈవీఎంల వాడకానికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పించింది.


