Zero Crime Village Model : సాధారణంగా గ్రామం అంటే చిన్నపాటి గొడవలు, నేరాలు, దొంగతనాలు, చివరకు హత్యలు కూడా సర్వసాధారణం. నేటి సమాజంలో అసలు ఒక్క క్రిమినల్ కేసు కూడా లేని గ్రామం ఉందంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా..? కానీ అటువంటి అద్భుతమైన గ్రామం అస్సాంలో నిజంగానే ఉంది. ఆ గ్రామ చరిత్రలో ఇప్పటివరకు ఒక్క పోలీస్ వాహనం కూడా అడుగుపెట్టిన దాఖలాలు లేవు. ఇంతకీ ఆ గ్రామానికి అంతటి ప్రత్యేకత ఏంటి? అక్కడి ప్రజలు ఎలా జీవిస్తారు..?
సమస్య వస్తే అందరూ కలిసి సామరస్యంగా పరిష్కరించుకుంటారు : అస్సాంలోని నాగోన్ జిల్లా, దింగ్ ప్రాంతంలో కొలువై ఉంది సహారియా గ్రామం. ఈ గ్రామంలో ఇప్పటివరకు ఒక్క నేర కేసు కూడా నమోదు కాలేదని అక్కడి గ్రామస్థులు సగర్వంగా చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, ఎలాంటి సమస్యలు తలెత్తినా, అవి ఎంత చిన్నవైనా, పెద్దవైనా సరే, గ్రామ ప్రజలందరూ ఒకచోట చేరి గ్రామ పెద్దల సమక్షంలో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సునీల్ మహేలా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఇప్పటికీ ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కాలేదు : సునీల్ మహేలా చెప్పిన వివరాల ప్రకారం, “1413 సంవత్సరంలో ఈ గ్రామంలో కేవలం నాలుగు ఇళ్లు మాత్రమే ఉండేవి. కాలక్రమేణా కుటుంబాల సంఖ్య పెరిగింది. ఇది ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతం. అయినప్పటికీ, మా బోడో సమాజం, ముఖ్యంగా మా పూర్వీకులు, కష్టపడి భూమిని చదును చేసి, మతపరమైన విలుల, సాంస్కృతిక సంప్రదాయాలు, విద్యకు ప్రాముఖ్యతనిస్తూ ఈ గ్రామాన్ని స్థాపించారు. నేడు మనం 21వ శతాబ్దంలో ఉన్నప్పటికీ, మా గ్రామం అద్భుతంగా అభివృద్ధి చెందింది. అయినా సరే, ఇప్పటికీ ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కాలేదు. ఎలాంటి సమస్యలు ఎదురైనా, మేము శాంతియుతంగా చర్చించుకొని పరిష్కరించుకుంటాం. ఇటీవలి కాలంలో మా గ్రామం గణనీయమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఇక్కడ ఉన్న చాలామంది ప్రజల జీవనోపాధి ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది.”
గ్రామాలకు ఒక ఆదర్శం : ఈ గ్రామంలోని యువత డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. ఎందుకంటే గ్రామస్థులు మాదకద్రవ్యాల విషయంలో అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటారు. యువత విద్య, క్రీడలు, సాంస్కృతిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ, ఎలాంటి వ్యసనాలకు లోను కాకుండా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. నేరాలను అదుపుచేయడంలో సహారియా గ్రామానికి ఉన్న క్రమశిక్షణ, సామరస్యం నిజంగానే మిగతా గ్రామాలకు ఒక ఆదర్శం. ఈ గ్రామంపై ఉన్నతాధికారుల నుంచి కూడా మంచి స్పందన లభించింది. నాగోన్ పోలీస్ సూపరింటెండెంట్ స్వప్ననీల్ స్వయంగా ఈ గ్రామాన్ని ప్రశంసించారు. “ఇలాంటి గ్రామాన్ని నేను ఇప్పటివరకు చూడలేదు. సమస్యలు వస్తే అక్కడ ఉన్న విలేజ్ డిఫెన్స్ పార్టీ, పౌర కమిటీలతో కలిసి సామరస్యంగా పరిష్కరించుకుంటారని” ఆయన పేర్కొన్నారు.


