Thursday, July 4, 2024
HomeNewsAfter Maharashtra Bihar Next: ముందు శివసేన, తరువాత ఎన్సీపీ, నెక్ట్స్ నితీష్ పార్టీ!

After Maharashtra Bihar Next: ముందు శివసేన, తరువాత ఎన్సీపీ, నెక్ట్స్ నితీష్ పార్టీ!

శరవేెగంగా మారుతున్న జాతీయ రాజకీయ ముఖచిత్రం

పెద్ద చేప చిన్న చేపలను మింగినట్టే ఉంటాయి రాజకీయాలనే పరమపద సోపానంలో. అందుకే ఉపప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలు కుదిరితో తమలో విలీనం చేసుకోవటం లేదంటే కనీసం చీల్చటంపై చాలా ఫోకస్ పెడుతుంటాయి.  ఒకప్పుడు దేశంలోని చిన్నా చితకా పార్టీలు ఇలాంటి పరిస్థితినే కాంగ్రెస్ మూలంగా ఎదుర్కొన్నాయి.  ఇదే జరుగుతోంది ఇప్పుడు కూడా.  కాకపోతే ఇప్పుడు ఈ పని చేస్తున్నది బీజేపీ అంతే తేడా.  విషయం మాత్రం సేమ్. 

- Advertisement -

ముందే హెచ్చరించిన ఫడ్నవిస్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) విషయంపై జూన్ 29న హింట్ ఇస్తూ విషయాన్ని లీక్ చేశారు మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.  ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే, కాబట్టి శరద్ పవార్ కూడా తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు అజిత్ పవార్ ను ప్రకటించి, సర్కారు ఏర్పాటు చేస్తారని ఫడ్నవిస్ చెప్పిన అతి కొద్ది రోజుల్లోనే ఎన్సీపీలో సంక్షోభం తలెత్తింది.

ఇక నితీష్ వంతేనా?

ఇప్పుడు సేమ్ హింట్ ఇస్తున్నారు బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోడీ.  త్వరలో బిహార్ అధికార పార్టీ అయిన జేడీయూలో చీలిక రావటం ఖాయమని, ఈసారి వంతు సీఎం నితీష్ కుమార్ దేనని సుషీల్ మోడీ చెప్పటం విశేషం.  జేడీయూకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, పతనం అంచున నితీష్ పార్టీ ఉందని సుశీల్ హెచ్చరించటం జాతీయ రాజకీయాల్లో కాక రేపుతోంది.  అచ్చం మహారాష్ట్ర పరిస్థితే బిహార్ లో పాకాన పడుతోందని, రాబోయే రోజుల్లో ఏదైనా సాధ్యమేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు జేడీయూలో గుబులు రేపుతున్నాయి.

తేజస్వితోనే చిక్కులు

తన తరువాత లాలూ కుమారుడు తేజస్వి యాదన్ ను రాజకీయ వారసుడిగా నితీష్ ప్రకటించినప్పటినుంచీ జేడీయూలో పరిస్థితి అధ్వానంగా మారాయనేది హాట్ టాపిక్.  పైగా రాష్ట్రంలో నానాటికీ జేడీయూ పరిస్థితి తీసికట్టుగా మారింది.  గత ఎన్నికల్లో నితీష్ పార్టీకి 18 సీట్లు రాగా ఈసారి కనీసం 10 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని జేడీయూ నేతలే స్వయంగా అంగీకరిస్తున్నారు.  దీంతో తమ వ్యక్తిగత రాజకీయ మనుగడ కోసం ఇతర పార్టీలను సంప్రదించే జేడీయూ నేతల సంఖ్య విపరీతంగా పెరిగిందనేది సరికొత్త వాదనగా రాష్ట్ర రాజకీయ తెరపైకి వస్తోంది.  రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రాబ్రీదేవి, కుమారుడు తేజస్విపై అటు సీబీఐ చార్జ్ షీట్ సైతం దాఖలు చేసిన ఈ తరుణంలో బిహార్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.

ప్రాంతీయ పార్టీలకు హడల్

మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, బిహార్ లో జేడీయూ-ఆర్జేడీల పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్న దేశంలోని అన్ని ప్రాంతీయ, ఉప-ప్రాంతీయ పార్టీల్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది.  అసలే లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ్, ఈ ఏడాది చివరికల్లా కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ ప్రాంతీయ పార్టీల్లో హడల్ స్టార్ట్ అయింది.  అసలే ఎన్డీఏను బలోపేతం చేస్తామంటూ చాలా కాలం తరువాత మోడ-షా టీం పాత పల్లవిని అందుకోవటం చూస్తుంటే ఇక దేశంలో బహుముఖ పార్టీల పాలనకు కాలం చెల్లినట్టు, ఏక పార్టీ పాలన లేదా రెండు పార్టీల పాలనకు సమయం ఆసన్నమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ నిపుణులు సైతం భాష్యం చెబుతున్నారు.

ప్రతిపక్షాల ఐక్యత నేతి బీరకాయ

ఇక ప్రతిపక్షాల ఐక్యత సంగతి దేవుడెరుగు ముందు ఇంటిని చక్కదిద్దుకుని, పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకుంటే చాలన్నట్టు ప్రాంతీయ పార్టీల పరిస్థితి తయారైంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల ఐక్యతకు ఆదిలోనే చెక్ పెట్టేలా మోడీ-షా ద్వయం ఇటు ఉమ్మడి పౌరస్మృతిని, మరోవైపు ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేసే పనులను విజయవంతంగా చేస్తుంటే ఇక ప్రతిపక్ష పార్టీలు ఒక గొడుగు కిందికి వచ్చి, ఉమ్మడి ప్రధాని అభ్యర్థిని నిలిపి, ఎన్నికలు గెలవటం సాధ్యమా అన్నది మరో చర్చనీయాంశంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News