Botsa Satyanarayana walkout from Council: ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అనధికార విగ్రహాల ఏర్పాటు అంశం తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల ప్రస్తావన రావడంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య రచ్చ మొదలైంది. ఇరు పక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఈ పరిణామాల మధ్య విపక్ష నేత బొత్స సత్యనారాయణ సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుడు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, పులివెందులలో ప్రజా నిధులతో వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఉన్న చోట.. అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్సీలు తిరుమలనాయుడు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా అనధికార విగ్రహాలను నియంత్రించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే, టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ నాయకుడు వైఎస్ఆర్‌ను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. దీనికి నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి, బయటకు వెళ్లిపోయారు.
Also Read: https://teluguprabha.net/national-news/kerala-luxury-cars-case-dulquer-salmaan/
అనధికారిక విగ్రహాలను తొలగిస్తాం..
ఈ చర్చ అనంతరం, సభ్యులు అడిగిన ప్రశ్నలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చెందిన 2524 విగ్రహాలను అనధికారికంగా ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. వీటిలో జాతీయ రహదారులపై 38, రాష్ట్ర రహదారులపై 1671, రాష్ట్ర హైవేలపై 815 విగ్రహాలు ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, 2013 ఫిబ్రవరి 18న జారీ చేసిన జీవో 18 ప్రకారం ప్రధాన రోడ్లు, ఫుట్‌పాత్‌లపై విగ్రహాల ఏర్పాటుకు అనుమతి లేదని మంత్రి గుర్తుచేశారు. అయితే, ఈ నిబంధన హై మాస్ట్ లైట్లు, రోడ్ల సుందరీకరణ వంటి ప్రజా వినియోగ పనులకు వర్తించదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న విగ్రహాలను తొలగించాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి సభకు తెలిపారు. కాగా, కూటమి ప్రభుత్వం పులివెందులోని కూడళ్ల సుందరీకరణకు రూ. 3.50 కోట్లు నిధులు మంజూరు చేసి, పనులు చేపట్టిందని వివరించారు. కడప పట్టణంలోని సర్కిళ్లను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ, డిఎంఎస్ రూ. 7.21 కోట్లు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేశామన్నారు. 2019లో ఇచ్చిన జీవో ప్రకారం, విగ్రహాలకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని, అనధికారికంగా ఏర్పాటు చేసిన విగ్రహాల విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి బీసీ జనార్ధన్ సమాధానం ఇచ్చారు.


