Marri Janardhan Reddy Comments: బీఆర్ఎస్ నేత నాగర్‌కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రాష్ట్ర పోలీసుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, “కందనూలు ప్రాంతంలో పనిచేస్తున్న ప్రతి ఎస్సై, సీఐ, డీఎస్పీ పేర్లు మేము రికార్డు చేసుకుంటున్నామని ఆయన హెచ్చరించారు. మా కార్యకర్తలపై అకారణంగా ఒత్తిడి తెచ్చే అధికారులపై భవిష్యత్తులో కీలక చర్యలు ఉంటాయని అన్నారు. వారు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టమని సీరియస్ అయ్యారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రస్తుతం పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి సొంత సహాయకులుగా మారిపోయారన్నారు. ముఖ్యమంత్రి మీద సోషల్ మీడియాలో ఎవరైనా చిన్న కామెంట్ చేసినా, రాత్రికి రాత్రే పోలీసు అధికారులు ఆయా వ్యక్తుల ఇళ్ల వద్దకు చేరుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
డా. బీఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవ్వరూ వ్యవహరించినా.. అది వారికే నష్టమని తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని.. కానీ పౌరుల హక్కులనును పోలీసులు, అధికారులు అడ్డుకోకూడదని అన్నారు.
ప్రజలకు న్యాయం చేయడం పోలీసు వ్యవస్థ ధర్మమని… కానీ నేటి పరిస్థితుల్లో కొన్ని చోట్ల అధికారులు పాలక పక్షానికి విధేయులుగా ప్రవర్తిస్తున్నారని ఈ పద్ధతికి వెంటనే స్వస్తి చెప్పాలని అన్నారు. ఆయన ప్రసంగంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.
కాంగ్రెస్‌కి మరోసారి అధికారం ఓ కల: రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయ పరిస్థితులను ఉద్దేశించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందనుకోవడం కేవలం కలగానే మిగిలిపోతుందని జోస్యం చెప్పారు. వచ్చే 25 సంవత్సరాలపాటు తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఉండబోదని అన్నారు. ఇకనైనా గొప్పలు చెప్పుకోవడం మానేసి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు.


