ఉత్తరకొరియాలో స్త్రీలు తమ పెదాలకు ఎరుపు రంగు లిప్‌స్టిక్ వేసుకోకూడదు. ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ యున్ కొత్తగా ఈ నిషేధాన్ని తమ దేశ మహిళలపై విధించారు. తన దేశ ప్రజల బహిరంగ జీవితాలనే కాదు వ్యక్తిగత జీవితాలను సైతం కిమ్ అనుక్షణం నియంత్రిస్తుంటారనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. నియంతృత్వ పోకడలకు కిమ్ పెట్టింది పేరు. ఆయన కనుసన్నల్లోనే అక్కడి ప్రజల జీవితాలు కొనసాగుతాయి. ఇందుకు తాజా ఉదాహరణే ఆ దేశంలో ఎరుపు రంగు లిప్‌స్టిక్ వాడకంపై నిషేధం విధించడం. ఇంతకూ ఎర్రలిప్‌స్టిక్‌ను ఆడవాళ్లు తమ పెదాలకు ఎందుకు రాసుకోకూడదో తెలుసా?
పెట్టుబడిదారీ విదానానికి ఎరుపు రంగు చిహ్నమంట. ఇది ఆ దేశాధ్యక్షుడు కిమ్ భావన. అందుకే ఆడవాళ్లు ఎర్రలిప్‌స్టిక్‌ను పెదాలకు వేసేుకోకూడదు నిషేదాజ్ఞలను ఆయన జారిచేశారు. అంతేకాదు ఉత్తర కొరియా దేశ మహిళలందరూ కేవలం లేత రంగు లిప్‌స్టిక్స్‌ను మాత్రమే తమ పెదాలకు వేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎరుపు రంగును పెదాలకు వేసుకోకూడదు. అంతేకాదు అక్కడ స్త్రీలు మోతాదు మించి మేకప్ వేసుకున్నా కష్టాలే. అందుకే ఆ దేశంలో రకకాల మేకప్ ఉత్పత్తులపై సైతం నిషేధం విధించారు. ముఖానికి ఎక్కువ మేకప్ వేసుకున్నా, అత్యాధునిక దుస్తులు ధరించిన మహిళలు బయట కనిపిస్తే చాలు వారిని అరెస్టు చేసేందుకు ఉత్తర కొరియాలో ఎల్లవేళలా పోలీస్ పెట్రోలింగ్ వ్యానులు కూడా తిరుగుతుంటాయిట. అందంగా కనిపించడమూ తప్పేనా అని అక్కడి మహిళలు వాపోతున్నారట పాపం.