Weather Forecast: మొంథా తుపాను నష్టాల నుంచి ప్రజలు, రైతులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా పలుచోట్ల నిన్న భారీ వర్షం కురిసింది. దక్షిణ, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం మొదలుకుని రాత్రి వరకు మోస్తరు వర్షాలు కురిశాయి. ప్రస్తుతం తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. అది మరింత బలహీనపడి సాధారణ అల్పపీడనంగా మారినప్పటికీ.. తెలంగాణపై దాని ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.
ఈ కారణంగా రాబోయే రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాల తీవ్రత తక్కువగానే ఉంటుందని చెప్పింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.


