Sridhar Babu| వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై జరిగిన దాడిపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే కొందరు కలెక్టర్‌పై దాడికి పాల్పడేలా చేశారని తెలిపారు. రైతులను సభాస్థలికి రాకుండా అడ్డగించారని.. అందుకే రైతుల దగ్గరికే వెళ్లి స్వయంగా వారి అభిప్రాయాలు తెలుసుకుందామని కలెక్టర్ వెళ్లారని తెలిపారు. కానీ కొందరు రైతులను రెచ్చగొట్టి కలెక్టర్‌పై దాడి చేయించారని మండిపడ్డారు. కలెక్టర్‌పై దాడి ఘటనలో కుట్రదారులెవరో విచారణ చేస్తామన్నారు.
కలెక్టర్‌ను గ్రామంలోకి తీసుకెళ్లింది ఎవరనే దానిపై విచారణ జరుగుతుందని తెలిపారు. అధికారులపై దాడులు చేస్తే సహించేది లేదని.. అధికారం రాలేదనే ఆక్రోశంతో బీఆర్ఎస్ నేతలు కుట్రలకు దిగారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందకుండా గులాబీ శ్రేణులు అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఇలాంటి చర్యలకు దిగలేదని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలు ముఖ్యమని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమలు పెట్టినప్పుడు తాము కూడా ఇలాగే చేస్తే… అభివృద్ధి జరిగేదా..? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. కాగా కలెక్టర్‌పై దాడి వెనక బీఆర్ఎస్ కార్యకర్తల హస్తం ఉందని ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపిన సంగతి తెలిసిందే.