ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిందన్నది పాత సామెత. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాలను చూస్తే ఈ పాత సామెత మరోసారి గుర్తుకు వస్తోంది. వాస్తవానికి మధ్యప్రదేశ్‌లో ప్రధాన పార్టీలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్సే. అయితే బీఎస్పీ లాంటి కొన్ని పార్టీలు పోటీలో ఉన్నా వాటి ప్రభావం నామమాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా గెలుపోటములను ప్రభావితం చేసే సత్తా ఈ రాజకీయ పార్టీలకు లేదు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయాలని సమాజ్‌వాది పార్టీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ డిసైడ్ అయ్యారు. పొత్తులో భాగంగా ఈసారి ఆరు నియోజక వర్గాలు తమకు కేటాయించాలంటూ కాంగ్రెస్ పార్టీని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కోరారు. అయితే సమాజ్‌వాది పార్టీకి ఆరు సీట్లు ఇవ్వడానికి మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాధ్ అంగీకరించ లేదు. నాలుగు నియోజకవర్గాల వరకు తాము కేటాయించగలమని కమల్‌నాధ్ తేల్చి చెప్పినట్లు భోపాల్ పొలిటికల్ సర్కిల్స్ టాక్. మధ్యప్రదేశ్‌లో ఆరు సీట్లు ఇచ్చేంతటి సీన్ సమాజ్‌వాది పార్టీకి లేదన్నారు కమల్‌నాధ్. వాస్తవానికి 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సమాజ్‌వాది పార్టీ పోటీ చేసింది. అయితే సమాజ్‌వాది పార్టీ ఒకే ఒక్క సీటు గెలుచుకుంది.
అలాగే మరో రెండు నియోజకవర్గాల్లో సమాజ్‌వాది పార్టీ రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో సమాజ్ వాది పార్టీకి ఆరు సీట్లు ఇవ్వలేమని కమల్‌నాధ్ కుండ బద్దలు కొట్టారు. నియోజకవర్గాల కేటాయింపు విషయమై అఖిలేష్ యాదవ్, కమల్‌నాధ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒక దశలో, అసలు మధ్యప్రదేశ్‌లో పోటీ చేయడానికి అఖిలేష్ యాదవ్ ఎవరు అంటూ కమల్‌నాధ్ మండిపడ్డారు. కమల్‌నాధ్ కామెంట్ రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. దీంతో ఆగ్రహానికి గురైన అఖిలేష్ యాదవ్ మధ్యప్రదేశ్‌లో ఏకంగా 22 నియోజకవర్గాల నుంచి తమ అభ్యర్థులను బరిలోకి దించారు. అఖిలేష్ యాదవ్ వివాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ కురువృద్దుడు దిగ్విజయ్ సింగ్ జోక్యం చేసుకున్నారు. సమాజ్‌వాది పార్టీకి నాలుగు నియోజకర్గాలు కేటాయించాలని కమల్‌నాధ్ నిజాయితీతో ప్రయత్నించారన్నారు. కమల్‌నాధ్ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన పనిలేదన్నారు. అయితే మధ్యప్రదేశ్‌లో పోటీ చేయడానికి అఖిలేష్ యాదవ్ ఎవరు అంటూ కమల్‌నాధ్ కామెంట్ చేయడాన్ని దిగ్విజయ్ తప్పుపట్టారు. ఎవరు… ఎక్కడైనా పోటీ చేయవచ్చన్నారు. పనిలో పనిగా అఖిలేష్ యాదవ్ సమర్థుడైన నాయకుడని దిగ్విజయ్ కితాబు ఇచ్చారు.
లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపుతుందా ?
కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీల మధ్య కొంతకాలంగా సంబంధాలు బాగాలేవు. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరికీ కామన్ ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అయినా రెండు పార్టీలది ఎవరి దారి వారే అన్నట్లు ఉండేది. అయితే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ సంబంధాలు ఇటీవల బలపడ్డాయి. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏర్పడ్డ ఇండియా కూటమిలోనూ సమాజ్‌వాది పార్టీ చేరింది. మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని సంయుక్తంగా ఢీ కొనడమే ప్రతిపక్షాల ఐక్య వేదిక అయిన ఇండియా కూటమి ప్రధాన లక్ష్యం. కాంగ్రెస్ -సమాజ్‌వాది పార్టీ మధ్య నెలకొన్న వివాదం మధ్యప్రదేశ్ కే పరిమితం అవుతుందా ? లేక లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ వివాదం ఇలాగే కంటిన్యూ అవుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కాగా మధ్యప్రదేశ్ సీట్ల కేటాయింపు వివాదానికి ఇండియా కూటమికి సంబంధం లేదంటున్నారు కాంగ్రెస్ నాయకులు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు రెండూ వేర్వేరు అంశాలని స్పష్టం చేశారు కాంగ్రెస్ నాయకులు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ -సమాజ్‌వాది పార్టీ మధ్య నెలకొన్న వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. మిత్రపక్షాలను వాడుకుని అవసరం తీరాక వదిలేయడమే కాంగ్రెస్ కల్చర్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.
ఎస్, అబ్దుల్ ఖాలిక్
సీనియర్ జర్నలిస్ట్
- 63001 74320