సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పెరేడ్ గ్రౌండ్ లో వేడుకలకు హాజరయ్యే అతిథులకోసం సీటింగ్ అరేంజ్మెంట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
శకటాల కోసం ప్రత్యేక ట్రాక్
పెరేడ్ సందర్బంగా గ్రౌండ్ కు వచ్చే సాధారణప్రజల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు 2200 మంది ప్రముఖులు హాజరు అవుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సీటింగు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రౌండ్ లో త్రివిధ దళాలచే గౌరవ వందనం స్వీకరించే క్రమంలో ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులు వెళ్లే వాహనాల కోసం ట్రాక్ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వివిధ శాఖలు తమ ప్రగతిని తెలిపే విధంగా ఏర్పాటు చేసిన ప్రగతి శకటాల కోసం ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఈ వేడుకల్లో పాల్గొంటున్న త్రివిద దళాలకు చెందిన పోలీసు బలగాలు గత మూడు రోజులుగా గ్రౌండ్ లో రిహార్సల్స్ నిర్వహిస్తున్నాయి. కాగా శుక్రవారం నిర్వహించిన పోలీసుల రిపబ్లిక్ డే పెరేడ్ ను రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, జీడీపీ జితేందర్ పరిశీలించారు. అనంతరం గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లను వారు పరిశీలించారు.
ఎనిమిదేళ్ల తరువాత పెరెడ్ గ్రౌండ్లో రిపబ్లిక్ డే వేడుకలు
ఉమ్మడి ఏపీ రాష్టంగా ఉన్న కాలంలో ప్రతియేటా జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు సికింద్రాబాద్ పెరెడ్ గ్రౌండ్ లోనే జరిగేవి. ఇది ఆనవాయితిగా వస్తోంది. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పర్యాయాలు మాత్రమే పెరేడ్ గ్రౌండ్లో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించి అటు తరువాత నిలిపివేసి ఈ వేడుకలను ప్రతియేటా పబ్లిక్ గార్డెన్ లో నిర్వహిస్తూ వస్తోంది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ వేడుకలను తిరిగి పెరేడ్ గ్రౌండ్ లోనే నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో గత ఎనిమిదేళ్లుగా రిపబ్లిక్ డే సందర్బంగా బోసిపోయి కనిపించిన పెరేడ్ గ్రౌండ్ ఇప్పుడు కొత్త శోభను సంతరించుకుంది. ఒక వైపు పోలీసు దళాల రిహార్సల్స్, మరో వైపు వేడుకలకు జరుగుతున్న ఏర్పాట్లతో పెరేడ్ గ్రౌండ్ కు కొత్త కళ ఉట్టిపడుతుంది.