పరిశ్రమల నుంచి వెలువడుతున్న వాయు కాలుష్యం నియంత్రణలో నిబంధనలు ఉల్లంఘించే వారిని పీసీబీ గుర్తించలేని పక్షంలో ఆ ప్రాంతంలోని మొత్తం పరిశ్రమల పైన చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి రవి ఆయా పారిశ్రామికవేత్తలను హెచ్చరించారు. మంగళవారం పీసీబీ ప్రధాన కార్యాలయంలో ఆయా పారిశ్రమల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన సభ్య కార్యదర్శి ఈమేరకు హెచ్చరికలు జారీచేశారు.
3 షిఫ్టుల్లో నిఘా..
పరిశ్రమలపై పీసీబీ నిరంతరం నిఘా పెడుతుందని మూడు షిఫ్టులలో ఈ నిఘా ఉంటుందని తెలియజేశారు. అదే సమయంలో ఆయా సంస్థలు సైతం స్వీయ నియంత్రణ పాటించి, కాలుష్య కారకులను గుర్తించటంలో పీసీబీ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పరికరాల నిర్వహణ పరిశ్రమల కార్యకలాపాల మీద ఆయా పరిశ్రమల యాజమాన్యాలు దృష్టి కేంద్రీకరించి పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని పేర్కొన్నారు.
సి.ఇ.టి.పి. పంపించకపోతే..
వాయు కాలుష్యాన్ని నియంత్రించే పరికరాలు ఏర్పాటు చేసుకోవడం, వాటి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం ప్రతి ఒక్క పరిశ్రమ డ్యూటీ చార్ట్ లో ఈ మేరకు కలుషిత వాయువుల నిర్ధారణకు సంబంధించిన అంశాలను ప్రకటించటం తప్పనిసరి అని తెలిపారు. పారిశ్రామిక జల వ్యర్థాలను కామన్ ఎఫిలెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సి.ఇ.టి.పి.) పంపించని పరిశ్రమలను, చట్టవిరుద్ధంగా వ్యర్థాలను సమీప నాళాలు, కుంటల్లో కుమ్మరించే పరిశ్రమల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పారిశ్రామిక కాలుష్య నియంత్రణ అనేది పారిశ్రామిక సంఘాలకు కూడా ఒక సమిష్టి బాధ్యతగా అవుతుందని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తెలంగాణ కాలుష్య నియంత్రణా మండలి ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించి ఊరుకోదని స్పష్టం చేశారు. ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఉల్లంఘనలు చేసే పరిశ్రమలపై ఇకపై చర్యలు కఠినంగా ఉంటాయని గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఫార్మాసూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలతోసహా 20కి పైగా ప్రాంతాల నుంచి సుమారు 200 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. పీసీబీ చీఫ్ ఇంజినీర్ బి.రఘు ఈ సమావేశాన్ని సమన్వయపరిచారు.