దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ వలసవాద పాలన తరువాత 15 ఆగష్టు 1947న మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించినప్పటికీ, 1935లో బ్రిటిష్ పాలనలో రూపొందిన భారత ప్రభుత్వ చట్టమే అమలులో ఉండేది. కాగా దేశ స్వాతంత్ర్యానంతరం, “రాజ్యాంగ సభ” (Constituent Assembly) ద్వారా నవంబర్ 26, 1949న ఆమోదింపబడిన “భారత రాజ్యాంగం” మాత్రం 26 జనవరి, 1950 నుండి అమల్లోకి వచ్చింది. అలా ప్రతి సంవత్సరం 15 ఆగష్టు న “స్వాతంత్ర్య దినోత్సవం” మరియు 26 జనవరి న “గణతంత్ర దినోత్సవం” దేశవ్యాప్తంగా జాతీయ పండుగలుగా జరుపుకుంటున్నాము. “స్వాతంత్ర్య దినోత్సవం” రోజున దేశ రాజధాని ఢిల్లీ లో ప్రధాన మంత్రి, రాష్ట్ర రాజధానులలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ జెండాను ఎగురవేస్తారు. కాగా “గణతంత్ర దినోత్సవం” రోజున దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్రపతి మరియు రాష్ట్ర రాజధానులలో ఆయా రాష్ట్ర గవర్నర్లు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
రెండు వేడుకల మధ్య తేడా:
స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగరవేయడానికి, గణతంత్ర దినోత్సవం రోజు జెండా ఆవిష్కరించడానికి మధ్య తేడా ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున, స్తంభం దిగువన కట్టిన జాతీయ పతాకాన్ని పైకి లాగడం, బ్రిటిష్ వలసవాద పాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందడాన్ని సూచిస్తుంది. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైకి ఎగురవేసి బ్రిటిష్ జెండాను కిందికి దింపడం బ్రిటిష్ పాలన అంతమొందడాన్ని, భారత స్వీయ పాలన ఆరంభాన్ని మరియు నవ భారత ఆవిర్భావాన్ని సూచిస్తుంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని స్తంభం పై భాగంలో కట్టి, పైకి లాగకుండా అక్కడే విప్పడం ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉండడాన్ని తెలియజేస్తుంది. రెండు సందర్భాలలో జెండాను రెపరెపలాడించినప్పటికీ భారత పార్లమెంటుకు దేశ పౌరుల ద్వారా నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి భారత రాజ్యాంగం అమలు లోకి రావడం గానీ భారత రాష్ట్రపతి పదవిని చేపట్టడం గానీ జరగ లేదు. అందుచేత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన, “రాజ్యాంగ అధిపతి” అయిన రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవం నాడు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. స్వాతంత్ర్య మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధానిలోని రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎర్రకోటలో మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు కర్తవ్య పథ్ (సెప్టెంబర్ 2022 ముందు ‘రాజ్‌పథ్’) లో జరుగుతాయి.
భారత రాజ్యాంగం కూర్పు:
స్వాతంత్రానంతరం అప్పటి వరకు అమలులో ఉన్న బ్రిటిష్ రాజ్యాంగం స్థానంలో భారత్ తాను సొంతంగా రూపొందించుకున్న రాజ్యాంగాన్ని అమలుపర్చాలన్న సంకల్పంతో 6 డిసెంబర్ 1946న పరోక్ష ఎన్నిక ద్వారా 389 సభ్యులతో కూడిన “రాజ్యాంగ సభ” (Constituent Assembly)ను ఏర్పాటు చేసింది. రాజ్యాంగ సభ మొదటి సమావేశం 211 మంది సభ్యులతో ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనపు సెంట్రల్ హాలు లో (మే 2023 లో నూతన పార్లమెంటు భవనం ప్రారంభించబడింది) 9 డిసెంబర్ 1946 న జరిగింది. రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో భాగంగా సుమారు మూడేళ్ల కాలంలో పలు కమిటీలు ఏర్పాటు కాగా అందులో “రాజ్యాంగ ముసాయిదా కమిటీ” ముఖ్యమైనది. రాజ్యాంగం రాత ప్రతిని రూపొందించేందుకు 29 ఆగష్టు 1947 న “రాజ్యాంగ సభ” డా బాబా సాహెబ్ అంబేద్కర్ అధ్యక్షుడిగా ఏడుగురు సభ్యులతో కూడిన ఒక “ముసాయిదా కమిటీ” (Drafting Committee)ని ఏర్పాటు చేసింది. భారత రాజ్యాంగ నిర్మాణానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. ఇందుకోసం రాజ్యాంగ సభ 11 సార్లు, 165 రోజుల పాటు సమావేశమయ్యింది. రాత ప్రతిని తయారుచేసే క్రమంలో 114 రోజులు వెచ్చించిన రాజ్యాంగ సభ తన ముందుకు వచ్చిన 7,635 సవరణ ప్రతిపాదనలలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది. 26 నవంబర్ 1949 న ఆమోదింపబడిన భారత రాజ్యాంగ రాత ప్రతిపై 24 జనవరి 1950 న 284 మంది సభ్యులు సంతకాలు చేయగా, 26 జనవరి 1950 న “భారత రాజ్యాంగం” అమలులోకి వచ్చింది. అదే రోజున రాజ్యాంగ సభ రద్దయిన దరిమిలా ఏర్పాటైన తాత్కాలిక పార్లమెంట్, 1952 లో లోక్ సభకు సాధారణ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు కొనసాగింది. ప్రపంచంలోని అతి పెద్ద లిఖిత రాజ్యాంగాలలో ఒకటిగా పరిగణింపబడే భారత రాజ్యాంగం అవతారిక లేదా పీఠిక (Preamble), 448 అధికరణాలు (Articles), 12 షెడ్యూళ్ళతో (Schedules) కూడిన వివరణాత్మక గ్రంథం. భారత్ “గణతంత్ర రాజ్యం”గా ప్రకటించబడిన రోజునే నాలుగు సింహాల శిరస్సులతో (వెనుక శిరస్సు చిత్రంలో కనబడదు) కూడిన అశోక ధర్మ చక్రం భారతదేశ జాతీయ చిహ్నంగా ఆమోదించబడింది.
బ్రిటిష్ పాలనలో రూపొందిన “భారత ప్రభుత్వ చట్టం 1935” లో కీలక పాత్ర పోషించిన సర్ బెనెగళ్ నర్సింగరావు (బి ఎన్ రావు) రాజ్యాంగ సభకు “రాజ్యాంగ సలహాదారు”గా నియమింపబడ్డారు. ఆయన అమెరికా, కెనడా, ఐర్లండ్, బ్రిటన్ లోని న్యాయమూర్తులు, పరిశోధకులు, అధికారులతో చర్చలు జరిపి 1948 ఫిబ్రవరిలో తొలి ముసాయిదాను తయారు చేశారు. ఆ ముసాయిదాను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన డా అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్టింగ్ కమిటీ గణనీయమైన మార్పులు చేపట్టి మరింత మెరుగైనదిగా తీర్చిదిద్దారు. భారత రాజ్యాంగ నిర్మాతలు పంచవర్ష ప్రణాళికలు సోవియట్ రష్యా రాజ్యాంగం నుంచి ఆదేశిక సూత్రాలు (Directives of State Principles) ను ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి, మన “పీఠిక” లో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న ఆదర్శాలను ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకున్నారు. అందుకే ఇంగ్లీషులో మన రాజ్యాంగాన్ని “బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్” (Bag of Borrowings) అంటారు. భారత రాజ్యాంగం యొక్క పీఠికకు “అమెరికా రాజ్యాంగం”లోని ప్రియాంబుల్ ప్రేరణ అని పేర్కొనవచ్చు. మన రాజ్యాంగం లోని “ప్రాథమిక హక్కులు” (Fundamental Rights) అమెరికా రాజ్యాంగం ఆధారంగా ఏర్పడినవే. 1978కి పూర్వం ప్రాథమిక హక్కుగా ఉన్న “ఆస్తి హక్కు” 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ జాబితా నుండి తొలగించబడింది.
సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం:
“భారత రాజ్యాంగం” ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి చేకూరి 26 జనవరి 1950న రాజ్యాంగం అమలు లోకి వచ్చిన తరువాత “సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం”గా అవతరించినప్పటికీ “సోషలిస్ట్”, “సెక్యులర్” మరియు “ఇంటిగ్రిటీ” అనే పదాలు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశిక (Preamble)లో చేర్చబడ్డాయి. భారత రాజ్యాంగం నిర్దిష్ట ఏకీకృత నిర్మాణంతో సమాఖ్య నిర్మాణంతో కూడిన పార్లమెంటరీ ప్రభుత్వాన్ని అందిస్తుంది. దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం అయిన భారత రాజ్యాంగం ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలతో పాటు శాసన వ్యవస్థ (Legislature), కార్యనిర్వాహక వ్యవస్థ (Executive), న్యాయ వ్యవస్థ (Judiciary)ల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది. రాజ్యాంగం భారత ప్రభుత్వ వ్యవస్థ, రాష్ట్రాల నిర్మాణం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, విధులు, అధికారాలు, స్థానిక సంస్థలు, ఎన్నికలు లాంటి విషయాలను నిర్వచించింది. భారత రాజ్యాంగానికి క్లుప్తమైన ప్రవేశికగా ‘పీఠిక’ (Preamble)ను రూపొందించారు. దీనినే రాజ్యాంగ ప్రవేశిక, అవతారిక, ప్రస్తావన, మూలతత్వం, ఉపోద్ఘాతం, పరిచయం, ముందుమాట అని కూడా అంటారు. భారత రాజ్యాంగం ఈ పీఠికతోనే మొదలవుతుంది. దేశ ప్రజలు దేశంపై ఏర్పరచుకున్న ఆకాంక్షలు, ఆశయాలు, కోరికలు ఈ పీఠికలో సుస్పష్టంగా పొందుపరచబడ్డాయి.
రాజ్యాంగ సవరణ(ల)కు వెసులుబాటు:
సునిశిత దృష్టి కలిగిన భారత రాజ్యాంగ నిర్మాతలు, భవిష్యత్తులో ఏర్పడబోయే రాజ్యాంగ సంక్షోభాలను ముందుగానే ఊహించి రాజ్యాంగాన్ని రూపొందించినప్పటికీ అనూహ్యమైన పరిస్థితులలో ఉత్పన్నమయ్యే సమస్యలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా పరిష్కారాలను రూపొందించుకొనే వెసులుబాటును భారత రాజ్యాంగంలో కల్పించడం విశేషం. ఇప్పటికి భారత రాజ్యాంగంలో పీఠిక మరియు 470 అధికరణాలు ఉండగా, వీటిని 25 భాగాలుగా విభజించారు. 12 షెడ్యూల్‌లు మరియు ఐదు అనుబంధాలతో 26 ఆగష్టు 1950 న అమలు లోకి వచ్చిన నాటి నుండి సెప్టెంబర్ 2023 (చట్ట సభలలో మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్ కల్పించే బిల్లు) వరకు ఇది 106 సార్లు సవరించబడింది.
భారత రాజ్యాంగ ప్రతుల భద్రత:
రాజ్యాంగం రెండు మూల ప్రతులను(Original Copies) “ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా” అనే ఆయన స్వదస్తూరీతో అందంగా గ్రంథస్తం చేశారు. అందులోని ప్రతీ పేజీని శాంతినికేతన్ కు చెందిన కళకారులు బేహార్ రామ్ మనోహర్ సిన్హా మరియు నందలాల్ బోస్ లు అందమైన చిత్రాలతో తీర్చిదిద్దారు. హిందీ మరియు ఇంగ్లీషు భాషలలో రాయబడిన “భారత రాజ్యాంగం” చెరొక మూల ప్రతిని పార్లమెంటు లైబ్రెరీలో వాతావరణ మార్పులకు చెక్కుచెదరకుండా ఉండేలా ప్రత్యేకంగా హీలియం వాయువుతో నింపిన పెట్టెల్లో భద్రపరిచారు. ఇంగ్లిష్ ప్రతిలో 1,17,369 పదాలు ఉన్నాయి. 45.7 సెం.మీ మరియు 58.4 సెం.మీ పరిమాణంలో వెయ్యి సంవత్సరాల పాటు ఉండేలా మైక్రోబ్ రెసిస్టెంట్ పార్చ్‌మెంట్ షీట్‌లపై వ్రాయబడింది. 234 పేజీలతో కూడిన “భారత రాజ్యాంగం” మూల ప్రతులు ఒక్కొక్కటి 13 కిలోలు బరువుంటాయి.
రాష్ట్రపతి ఉపయోగించే గుఱ్ఱపు బగ్గీ చరిత్ర:
భారత రాజ్యాంగ అధినేత మరియు దేశ ప్రథమ పౌరుడు అయిన భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఉపయోగించే గుఱ్ఱపు బగ్గీకి సంబంధించి ఆసక్తికరమైన చరిత్ర ఇది. నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవానికి బయలుదేరే సమయంలో పదవీ విరమణ చేస్తున్న రాష్ట్రపతి బగ్గీలో ఎడమ వైపున, నూతనంగా పదవిని చేపట్టబోయే రాష్ట్రపతి కుడి వైపున కూర్చుని వెళ్లి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుగు ప్రయాణంలో కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి తమ స్థానాలను మార్చుకుంటారు. బంగారు పూత పూసిన ఈ గుఱ్ఱపు బగ్గీ నిజానికి బ్రిటిష్ కాలంలో భారత వైస్రాయ్‌కు చెందినది. విభజనానంతరం సహజంగానే రెండు దేశాలు ఈ విలాసవంతమైన బగ్గీని దక్కించుకునేందుకు ఆసక్తి చూపగా, నిర్ణయం కోసం ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ లో లాగా టాస్ వేసారు. భారత్ నుండి లెఫ్టినెంట్ కల్నల్ ఠాకూర్ గోవింద్ సింగ్ మరియు పాకిస్తాన్ నుండి సాహబ్జాదా యాకూబ్ ఖాన్ అందులో పాల్గొనగా, భారత్ టాస్ గెలిచి విలాసవంతమైన బగ్గీని చేజిక్కించుకుంది.
యేచన్ చంద్ర శేఖర్మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ
హైదరాబాద్,
✆ 8885050822