Monday, September 30, 2024
HomeNewsSahithi Vanam: తెలుగు సాహిత్యానికి పట్టుకొమ్మ వడ్లమూడి

Sahithi Vanam: తెలుగు సాహిత్యానికి పట్టుకొమ్మ వడ్లమూడి

సాహితీ పుంభావ సరస్వతి, ‘వాఙ్మయ మహాధ్యక్షు’డిగా..

ఆధునిక తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకూ ఆచార్య వడ్లమూడి గోపాలకృష్ణయ్య పేరు విననివారుండరు. సాహితీ పుంభావ సరస్వతిగా, ‘వాఙ్మయ మహాధ్యక్షు’డిగా, అనేక శాస్త్రాల్లో నిష్ణాతుడిగా, అనేక హోదాల్లో పనిచేసిన పరిశోధకుడిగా తెలుగునాట చెరగని ముద్ర వేసిన అతి గొప్ప సాహితీవేత్త గోపాలకృష్ణయ్య. కృష్ణాజిల్లా కౌతవరం గ్రామంలో రంగారావు, సరస్వతమ్మ దంపతులకు 1928 అక్టోబర్‌ 24న జన్మించిన వడ్లమూడి సంస్కృతంలో భాషాప్రవీణ వరకు చదువుకున్నారు. తెలుగు, సంస్కృత భాషల్లో లోతైన పరిశోధనలు, అధ్యయనాలు చేసి ఆయన రచించిన అనేక గ్రంథాలు తెలుగు సాహితీవేత్తలను, పరిశోధకులను, విద్యార్థులను ఇప్పటికీ రంజింపజేస్తూనే ఉన్నాయి. సంస్కృతం, తెలుగు, ఖగోళం, జ్యోతిషం, వాస్తు, శిల్పం, నాట్య వేదం, ఛందస్సు, జర్నలిజం, అలంకారం, ఆయుర్వేదం, మంత్ర శాస్త్రాలలో అసాధారణ ప్రజ్ఞా విశేషాలను కనబరచిన వడ్లమూడి మొత్తం మీద 24 శాస్త్రాల్లో చేసిన కృషికి గుర్తింపుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు కళాప్రపూర్ణ బిరుదును ప్రదానం చేసింది.
ఆయన జీవితం కేవలం సాహిత్యానికి, పరిశోధనలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆయన స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని చాలా కాలం పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. లాఠీ దెబ్బలను ఎదుర్కొన్నారు. అనేక సంఘాలతో సంబంధం పెట్టుకోవడం ద్వారా పేద ప్రజల అభ్యున్నతికి పాటుబడ్డారు. సంఘ సేవతో పాటు దురాచారాల నిర్మూలనకు కూడా పెద్ద ఎత్తున కృషి చేశారు. వీటి స్ఫూర్తితో ఆయన అనేక వ్యాసాలు, గ్రంథాలు రాశారు. గాంధీ శతకం, మానవులు, జయదేవ కృతి, ప్రజానీతి గేయాలు, అమ్మ, ప్రాచీన వాఙ్మయంలో వ్యవహార భాష- లిపి-ధ్వని, వ్యవహారిక భాషా వ్యాకరణం, మనిషి, మహర్షి, ఆయుర్వేదం, బాల న్యాయ దర్శనం, జానుతెనుగు, మార్గాదేశి, ఆరవేటి వంశ చరిత్ర, మహా యోగం, కృష్ణ శతకం వంటి విశిష్టమైన కావ్యాలను ఆయన రాశారు. ఇవి కాకుండా తీరని రుణం, రాజహంస లాంటి నాటికలను కూడా రాశారు. వేదాస్‌ క్రియేషన్‌ అనే ఆంగ్ల గ్రంథంలో వేదాల సారాంశాన్ని సోదాహరణంగా వివరించారు. అంతేకాక, మహా యోగం, కృష్ణ శత శతి అనే గ్రంథాలను పదివేలకు పైగా పద్యాలతో రచించారు.
గీత గోవిందం, గీత శంకరం, జయదేవుడి అష్టపదులు వంటి సంస్కృత కావ్యాలను తెలుగు భాషలోకి అనువదించడం అత్యంత సాహసోపేతమైన వ్యవహారమని ఎందరెందరో సాహితీవేత్తలు భావిస్తున్న తరుణంలో ఆ ఉత్కృష్టమైన కార్యక్రమాన్ని సమర్థంగా పూర్తి చేసి, తెలుగు సాహితీ ప్రియులను మంత్రముగ్ధులను చేసిన వ్యక్తి వడ్లమూడి. ఆయన తొలి రచన గాంధీ శతకం. ఆయన నిత్యం ఖద్దరు దుస్తులు ధరిస్తూ స్వచ్ఛమైన గాంధేయవాదిగా జీవితాన్ని కొనసాగించారు. ఆయన రాసిన ప్రాచీన వాఙ్మయంలో వ్యవహార భాష- లిపి-ధ్వని అనే పరిశోధనాత్మక గ్రంథాన్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగునాట భాషావేత్తలంతా ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుసరిస్తూ, భాషా శాస్త్రానికి సంబంధించిన వ్యాసాలు రాస్తుండడం గమనించాల్సిన విషయం. అనేక పుస్తకాలకు ఆయన నిగూఢమైన విషయాలతో కూడిన తొలి పలుకులు, పీఠికలు వడ్లమూడి అసాధారణ ధారణ శక్తికి, బహుముఖ ప్రజ్ఞకు గీటురాళ్లుగా నిలుస్తాయి.
తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి విశేష సేవలు అందించి, తెలుగు సారస్వత చరిత్రలో తమ కుంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్న గిడుగు రామ్మూర్తి, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు వంటి సాహితీమూర్తులు ఆయనను వాఙ్మయ మహాధ్యక్ష బిరుదుతో సత్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన సమూల శ్రీమదాంధ్ర రుగ్వేద సంహిత రచనకు వడ్లమూడి సంపాదకుడుగావ్యవహరించారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరులో ఉన్న సంస్కృత కళాశాలలో ఆంధ్ర భాషా విభాగం అధిపతిగా చాలా కాలం పనిచేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రచురించిన ఆరాధన, ఆంధ్రప్రదేశ్‌ అనే ప్రభుత్వ పత్రికకు ఆయన సంపాదకులుగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత భాండాగారానికి ఆయన వ్యవస్థాపక డైరెక్టర్‌ గా పనిచేయడం జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News