Saturday, October 12, 2024
Homeఓపన్ పేజ్A picture is worth a thousand words: చక్కటి దృశ్యకావ్యం - దృశ్యభాష

A picture is worth a thousand words: చక్కటి దృశ్యకావ్యం – దృశ్యభాష

శభక్తి, కుటుంబ వాత్సల్యం, సమాజ బాధ్యత, మాతృభాషాభిమానం, స్త్రీ జనోద్ధరణ, బాల్యం, సాహిత్యం ..

లోకం ఏమైపోతుందో? ఎటు వెళిపోతుందో? అని తెగ మదన పడేవాడే కవి, మంచికోసం తపన పడేదే కవిత్వం. ‘హితేన సహితం సాహిత్యం‘ కదా మరి. అలాంటి సాహిత్యాన్నే అందించారు కవి, రచయిత, బాలసాహితీ వేత్త, శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు తన 33వ పుస్తకం ‘దృశ్యభాష‘లో.
‘A picture is worth a thousand words’ అన్నది ఒక ఆంగ్ల నానుడి. అలాంటి దృశ్యాలే వీరి కవితల్లో ప్రతీకలు. ఆ దృశ్యమాలికలే ఈ పుస్తకంలో కవితలు. ‘వందే స్త్రీ తరం’ అన్న కవితతో శ్రీకారం చుట్టి 73 కవిత లతో నవరసాలు ఒలికించి ‘నాడు నేడు’ అన్న మినీ కవిత తో శుభం కార్డు వేసారు కవి. అబలల బలహీనతలను, కామవాంఛలకు అవకాశాలుగా మలుచుకోవాలనుకునే ఊసరవెల్లుల బాగోతాన్ని కళ్ళకు కట్టారు కవి. ఒకవైపు స్త్రీ సున్నితత్వాన్ని వర్ణిస్తూనే మరోవైపు ఆమె ముందు చూపును, సమయస్ఫూర్తిని కొనియాడారు ఈ కవితలో.
‘కోరికల చేతుల వేళ్ళు
నిన్ను తాకాలని చూసినప్పుడు
నివురు గప్పిన భావాగ్నిని
చిరునవ్వుల పెదాల పరదాల మాటున
దాచుకున్న నిత్యాగ్ని హోత్రివి నువ్వు’
అంటారు కవి.
‘నారీ శక్తి’ కవితలో పురాణాల్లో స్త్రీ పాత్రలను, చరిత్రలో వీరవనితలనూ ఉదాహరిస్తూ, వారి సాహసాలను కీర్తిస్తూనే అలాంటి గొప్పవారైన మహిళలను అబలలుగా భావించి అఘాయిత్యాలు చేయడం తగదని హెచ్చరించారు కవి.
తన మాతృభాష తెలుగు అంటే కవికి మక్కువ ఎక్కు వ. అందుకే అటు రచయితగా, బాలసాహితీవేత్తగా , ఇటు సాహితీ కార్యక్రమాల నిర్వాహకుడిగా సవ్యసాచిగా మారారు. తెలుగు కవులకూ, సాహిత్యానికి తనదైన సహకారాన్ని అందిస్తూ ముందుకు వెళుతున్నాడా కవి.
‘నలు దిశల చాటాలి తెలుగు భాష
జనులెల్ల పీల్చాలి తెలుగు శ్వాస’ అని తెలుగు భాష మీద అభిమానం , మమకారం చాటుకున్నారు తెలుగు శ్వాస కవితలో.
తెలుగు వాళ్ళు ఠీవిగా, ఆదర్శవంతంగా బ్రతకాలని ఆశించారు కవి. అందుకే ‘మేము తెలుగోళ్ళం’ అన్న కవితలో తెలుగు వారు చేస్తున్న అనేక తప్పులను, పరాయి సంస్కృతి, అలవాట్లు, భాషమీద చూపుతున్న వ్యామోహాన్ని కడిగి పారేసాలా వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టి సున్నిత విమర్శ చేసారు.
‘పుస్తకం హస్తభూషణం అని
అపర బుద్ధునిలా బోధిస్తాం
వాట్సాప్‌ ఫేస్బుక్లతో బద్దకంగా బ్రతికేస్తాం
ఎందుకంటే మేము తెలుగోళ్ళం’
అంటూ నడక సాగిస్తుంది కవిత.
దేశభక్తి, తెలుగుపై మమకారం, జాతి పౌరులకు స్ఫూర్తినివ్వాలనే తపన వెరసి ‘దేశమంటే మనదేనోయ్‌” గేయం. గేయం ఆసాంతం అంత్యప్రాసలతో పాడుకునేం దుకు వీలుగా సాగింది.
‘కృషితో ఎదిగిన జాతి ఇదేనోయ్‌ !
ఋషులు నడిచిన నేల ఇదేనోయ్‌!
భారత మంటే మనమేనోయ్‌!
భారతీయులు ఘనులేనోయ్‌’ !

‘అమ్మ నాన్న’, ‘మాతృదేవత’ కవితలలో తొలి గురువులు, ఇలవేల్పులు తల్లిదండ్రులేనని, వారి త్యాగాలు ఎనలేనివని కీర్తిస్తూ, ‘పసిడి హృదయం’ కవితలో ఒక తండ్రికి తన కూతురుపై ఉన్న వాత్సల్యానికి నిజమైన నిర్వచనాన్ని ఇచ్చారు కవి.
‘ప్రేమంటే’ కవితలో ప్రేమకు వాస్తవ భాష్యం తెలియ జెప్పారు కవి. అలాగే తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలని ‘నీ బిడ్డ‘ కవితలో పరితపించారు. బాల్యాన్ని బాలలను అమితంగా ఇష్టపడే వీరు తన బాల్య స్మృతులను, ‘ఆ రోజులు మళ్ళీ రావాలి’ కవితలో నెమరు వేసుకున్నారు. ఇక ‘అందాల బాలుడు’ బాలగేయమైతే ఆడుకుంటూ, గెంతుకుంటూ పాడుకొనే బాలుణ్ణే తలపిస్తుంది.
‘గలగల పారే ఏరుని చూస్తే
గడసరి బాలుడు గుర్తొస్తాడు
ఎత్తుగ నిలిచిన కొండను చూస్తే
ఎదిగిన బాలుడు గుర్తొస్తాడు’
అంటూ అనేక కోణాల్లో బాలుడిని వర్ణించిన తీరు మనసుకి హత్తుకుంటుంది.
సాహిత్యం అన్నా, సాహితీమూర్తులు అన్నా అమితమైన గౌరవం ప్రదర్శిస్తారు, ఆదరిస్తారు, ఆరాధిస్తారు ఈ కవి. వారిలోని ఆ ఆరాధనా భావమే ‘దృశ్య భాష’ కవితగా రూపుదిద్దుకుని కవితా సంపుటికి మకుటమైంది. డాక్టర్‌ సి నారాయణ రెడ్డిని ఈ కవిత ‘దృశ్య భాష’ ద్వారా మన సారా స్మరించుకున్నారు కవి.
మన టీమ్‌ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్మెన్‌ బరిలోకి దిగి, సిక్స్‌లు, ఫోర్లు కొడుతుంటే ఎంత మజా వస్తుందో, ‘మా బావ నాకు గుదిబండ’ అనే హాస్య కవిత చదివితే అంతగా మజా, నవ్వు వస్తాయి. హాస్య భరిత అంత్యప్రాసలతో, తమాషా పోలికలతో పాఠకునికి నవ్వుల పువ్వులు పంచుతుంది ఈ కవిత అనడంలో అతిశయోక్తి లేదు.
సమాజంలో ఉండే కపటత్వాన్ని ‘ఇవీ మన రాజకీయాలు’ అనే కవితలో ఎలా ఎండగట్టారో పాఠకునికి ఇట్టే అర్థం అయిపోతుంది.
సరుకుల్లో కల్తీలు
ఇరుకుల్లో డబ్బు సంచులు
ఇవి మన వ్యాపారాలు!
కాలేజీలో స్ట్రైకులు
పరీక్షల్లో కాపీలు
ఇవి మన చదువులు’!
ఇలా సమాజంలోని స్థితిగతులను కళ్లకు కట్టినట్టు వర్ణించిన కవితను, దాన్ని వ్రాసిన ఈ కవిని అభినందించి తీరతాం.
సమాజ శ్రేయస్సుకై వీరు పడే తపన, ఆవేదన వారి కవితల్లో ప్రస్ఫుటమవుతున్నాయి. నైతిక విలువలు, ముం దు జాగ్రత్త ఉండాలని పాఠకులకు దిశానిర్ధేశం చేస్తున్నారు కవి. వాస్తవికతకు విరుద్ధంగా ఉండవద్దని అంటూ చైతన్య పరుస్తున్నారు.
‘ముందుగానే చెబుతున్నా
ముసుగు తెరలు తొలగించి
మసక చీకటికి స్వస్తి చెప్పి
వెలుతురులోకి రండి
పచ్చినిజాలు ఒప్పుకోండి’
అని హెచ్చరిస్తాడు చీకటి సామ్రాజ్య నేతలను.
దాదాపుగా అన్ని కవితలు వేరువేరు పత్రికల్లో ముద్రితమైనవే. ఈ కవితలు దేశభక్తి, కుటుంబ వాత్సల్యం, సమాజ బాధ్యత, మాతృభాషాభిమానం, స్త్రీ జనోద్ధరణ, బాల్యం, సాహిత్యం వంటి ఎన్నో సున్నితాంశాలను స్పృశిస్తూ, ఆదర్శ పౌరుని జీవన విధానాన్ని, సన్మార్గాన్ని ప్రభోధించాయి. మరి మానవుణ్ణి పశుత్వం నుండి పరమేశ్వరత్వం వైపుకి నడిపించే ప్రాథమిక సూత్రాలు కలిగినదే కదా సాహిత్యం. ఆ విషయంలో దృశ్యభాష శతశాతం విజయం సాధించిందని ఘంటాపథంగా చెప్పవచ్చు. తోటివారి పట్ల, జీవరాశుల పట్ల దయగలిగి ఉండాలన్న వీరి కవితలలో మృదుత్వం, కరుణారసం కురిపించారు ఈ మేలెరిగిన మనిషి. మరి ‘కవి కలంలో కారుణ్యం ఉంటే కావ్యాలలో కాఠిన్యం వస్తుందా?’ అని ఒక కవితలో వారే చెప్పినట్టు ఇలాంటి కవితా సంపుటి వెలువడాలంటే కవి కలంలో సృజనాత్మకతతో బాటు మానవత్వం కూడ మిళితమై ఉంటేనే సాధ్యం.
ఈ పుస్తకం ఒక ‘దృశ్యకావ్యం’ నేటి తరానికి దిక్సూచి అవుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇంతటి మేటి కవిత్వాన్ని అందించిన కవి నారంశెట్టికి, ప్రచురించిన తపస్వి మనోహరం వారికి అభినందన మందారాలు. చక్కని ముఖచిత్రంతో పుస్తకంలోని భావాలను ప్రతిఫలింపజేసిన చిత్రకారుడు తుంబలి శివాజీ అభినందనీయుడు. చక్కని కవిత్వం చదవాలన్న ఆసక్తి ఉన్నవారంతా చదవాల్సిన పుస్తకం దృశ్యభాష అని చెప్పవచ్చు.

- Advertisement -
  • గొట్టాపు శ్రీనివాస రావు
    70137 57285

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News