AHMEDABAD PLANE CRASH 2025 : గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ విషాదకర సంఘటన, గతంలో విమాన లేదా హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ఇతర భారతీయ ప్రముఖులను గుర్తుచేస్తుంది. భారత చరిత్రలో జరిగిన కొన్ని విషాదకర విమాన ప్రమాదాలను గుర్తు చేసుకుందాం.
మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి :
ఈ ఘోర విమాన ప్రమాదంలో మొత్తం 265 మంది మరణించారు, వారిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా, మిగిలిన వారు ప్రమాదం జరిగిన హాస్టల్ భవనంలోని వైద్య విద్యార్థులు. విమానంలో ప్రయాణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా దుర్మరణం చెందారు. ఆయన తన అదృష్ట సంఖ్యగా భావించే జూన్ 12 తేదీనే ఈ విషాదం చోటుచేసుకోవడంతో పాటుగా విమానంలో ఆయన కూర్చున్న సీటు నంబర్ కూడా 12 కావడం విశేషం.
గగన ప్రమాదంలో మరణించిన ప్రముఖులు :
గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీని బలిగొన్న ఇటీవలి విమాన ప్రమాదం, గతంలో సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాలు, లేదా ప్రతికూల వాతావరణం కారణంగా భారత్ కోల్పోయిన పలువురు ప్రముఖుల విషాద మరణాలను తిరిగి గుర్తుచేస్తుంది.
బల్వంత్రాయ్ మెహతా (1965): గుజరాత్ తొలి ముఖ్యమంత్రి. 1965 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధంలో, ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని పాకిస్తాన్ సైన్యం కూల్చివేయడంతో వీరమరణం పొందారు.
గుర్నామ్ సింగ్ (1973): 1973 జనవరి 31న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో జరిగిన చిన్న విమాన ప్రమాదంలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి గుర్నామ్ సింగ్ మరణించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరిగినా, ఆయన మృతి పంజాబ్ రాజకీయాలపై, ముఖ్యంగా శిరోమణి అకాలీ దళ్‌పై తీవ్ర ప్రభావం చూపింది, విమాన ప్రయాణ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది.
హోమీ బాబా: భారత అణు కార్యక్రమ పితామహుడు హోమీ జహంగీర్ బాబా 1966 జనవరి 24న ఎయిర్ ఇండియా 101 విమాన ప్రమాదంలో మరణించారు. స్విస్ ఆల్ప్స్‌లోని మోంట్ బ్లాంక్ శిఖరంపై విమానం కూలిపోవడానికి జెనీవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో పైలట్లు సరిగ్గా సంభాషించకపోవడమే కారణమని తేల్చారు. అయితే, ఆయన మరణం వెనుక అణు కార్యక్రమాలను నిరోధించడమే లక్ష్యంగా కుట్ర జరిగిందన్న వాదనలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి.
సంజయ్ గాంధీ : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ, ఏరోబాటిక్స్‌లో నిష్ణాతుడు. 1980 జూన్ 23న ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఏరోబాటిక్స్ విన్యాసాలు చేస్తుండగా విమానం అదుపుతప్పి కూలిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రమాదమా, లేక అంతకుముందు జరిగిన హత్యాయత్నం వంటి కుట్రకు కొనసాగింపా అనే ప్రశ్నలు అప్పట్లో తలెత్తాయి.
వాతావరణ శాపం: మాధవ్‌రావ్ సిందియా, వైఎస్సార్
సీనియర్ కాంగ్రెస్ నేత మాధవ్‌రావ్ సిందియా 2001 సెప్టెంబరు 30న కాన్పూర్‌కు వెళ్తుండగా ప్రతికూల వాతావరణం కారణంగా విమానం కూలి మరణించారు. ఇదే విధంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 సెప్టెంబరు 2న నల్లమల అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. వాతావరణం అనుకూలించకపోవడం, పైలట్లు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వంటి కారణాలతో ఈ రెండు విషాదాలు సంభవించాయి. వైఎస్సార్ హెలికాప్టర్ కూలడానికి పైలట్ తప్పిదం, సాంకేతిక లోపం కలయిక అని విచారణలో తేలింది.
హెలికాప్టర్ ప్రమాదాలు: లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి (2002), ప్రముఖ నటి సౌందర్య (2004), మేఘాలయ మంత్రి సైప్రియన్ సంగ్మా (2004), పారిశ్రామికవేత్త ఓం ప్రకాశ్ జిందాల్ (2005), అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం దోర్జీ ఖండు (2011), భారతదేశపు తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ (2021) వంటి ప్రముఖులు కూడా హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించారు. ఈ ప్రమాదాల్లో కొన్నింటికి ఇంజిన్ వైఫల్యం, ప్రతికూల వాతావరణం, పైలట్ తప్పిదాలు కారణాలుగా నిలిచాయి. సౌందర్య విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలింది. ఈ విమాన ప్రమాదాలు భారత చరిత్రలో విషాదకర అధ్యాయాలుగా మిగిలిపోయాయి. అహ్మదాబాద్‌లో జరిగిన దుర్ఘటనతో సహా, ఇలాంటి ఘటనలు భద్రతా చర్యలపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.


