Ludo Game : ఇటీవల కాలంలో ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలు అయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. చిన్న పిల్లలే కాదు పెద్ద వాళ్లు సైతం ఈ గేమ్స్ వ్యామోహంలో పడి పోతున్నారు. కొందరు ఉద్యోగాలు మానేసి మరీ ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆటల్లో డబ్బులు పోగొట్టుకుంటూ ఆర్థికంగా చితికిపోతున్నారు. కొందరు అప్పుల ఊబిలోంచి బయటకు రాలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.
డబ్బు సంపాదన కోసం భర్త వేరే ప్రాంతానికి వెళ్లగా ఖాళీగా ఉండడంతో అతడి భార్య ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైంది. ఇంకేముంది భర్త పంపించే డబ్బులను బెట్టింగుల్లో పెట్టి మొత్తం పోగొట్టుకుంది. అంతటితో ఆగిన బాగుండేది. ఆమె దానికి ఎంతలా బానిసగా మారిందంటే చివరికి తనని తాను పందెం కాసింది. ఆ ఆటలో ఓడిపోవడంతో ఇంటి యజమాని ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లి పోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన రేణుక కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపాధి నిమిత్తం ఆమె భర్త 6 నెలల క్రితం రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లాడు. అక్కడ పని చేస్తూ భార్యకు డబ్బులు పంపించేవాడు. భర్త లేకపోవడంతో ఖాళీగా ఉన్న రేణుక ఆన్‌లైన్ గేమ్స్ ఆడడం మొదలుపెట్టింది. ముఖ్యంగా లూడో గేమ్‌కు బానిసైంది. ఇంటి యజమానితో కలిసి ఆమె రోజు లూడో ఆడేది. తన వద్ద ఉన్న నగదుతో పాటు భర్త పంపించే డబ్బులను మొత్తం బెట్టింగ్‌లో పోగొట్టుకుంది. అయినప్పటికీ ఆమెలో మార్పు రాలేదు.
చివరకు తనపైనే పందెం వేసుకుంది. ఆ ఆటలో సైతం ఓడిపోయింది. దీంతో ఇంటి యజమాని ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు ఫోన్ చేసి తెలిపింది. వెంటనే రేణుక భర్త ప్రతాప్‌గడ్‌కు వచ్చాడు. యజమానిని వీడి ఇంటికి రావాలని రేణుకను కోరాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. చివరకు రేణుక భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.