రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర నుంచి ఉత్తర్ ప్రదేశ్ లీడర్లు ఒక్కొక్కరే దూరం జరుగుతున్నారు. ఇప్పటికే రాహుల్ యాత్రకు రావాలన్న ఆహ్వానాన్ని ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి తిరస్కరించారు. తాజాగా ఈ క్లబ్ లో చేరినట్టు మాట్లాడారు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండూ ఒకటేనంటూ అఖిలేష్ యాదవ్ పేర్కొనటం విశేషం. దీంతో ఇక 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లోనూ విపక్షాల ఐక్యత అసాధ్యం అనే విషయం తేటతెల్లమవుతోంది. కాంగ్రెస్ నేతృత్వంలో జట్టు కట్టి, బీజేపీని గద్దె దించేందుకు ఉత్తర్ ప్రదేశ్ లోని ఏ ప్రాంతీయ పార్టీ రెడీగా లేదు. రాహుల్ యాత్రకు సంఘీభావంగా హాజరవుతారా అన్ని రిపోర్ట్స్ ప్రశ్నకు సమాధానమిచ్చిన మాజీ సీఎం అఖిలేష్.. తమ పార్టీ సిద్ధాంతాలు, భావజాలం వేరని, బీజేపీ-కాంగ్రెస్ మాత్రం ఒక్కటేనని చెప్పి షాక్ ఇచ్చారు. అయితే యాత్రకు హాజరు కావాలంటూ తనకు ఎటువంటి ఆహ్వానం అందలేదని అఖిలేష్ చెబుతున్నారు మరోవైపు తాము పంపినట్టు కాంగ్రెస్ చెబుతోంది. జనవరి 3వ తేదీన యూపీలో భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది.