సిపిఎం పార్టీ గార్ల మండల నూతన కార్యదర్శిగా అలువాల సత్యవతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక వర్తక సంఘం భవనంలో సీతారాం ఏచూరి నగర్, సూర్ణపు సావిత్రమ్మ ప్రాంగణంలో జరిగిన ఆ పార్టీ 9 వ మహాసభలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శిగా అలవాల సత్యవతి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ తెలిపారు.
సత్యవతి ఉద్యమ ప్రస్థానం
నూతన కార్యదర్శిగా ఎన్నికైన అలవాల సత్యవతి గార్లలో పుట్ట కోట బజార్ లో 1983లో ప్రజానాట్యమండలిలో కళకారుణిగా ఉద్యమ ప్రస్థానం మొదలు కాగా, పార్టీ సభ్యులుగా ఉన్న తన తండ్రి కృష్ణమూర్తి బతుకుదెరువు కోసం ఖమ్మం వెళ్ళగా, 1985లో ఐద్వా ఖమ్మం పట్టణ కమిటీ సభ్యురాలిగా, ఖమ్మం డివిజన్ కార్యదర్శిగా పని చేశారు. 1998 లో పాండురంగాపురంలో పార్టీ సభ్యత్వం ఖమ్మం డివిజన్ కమిటీ సభ్యురాలుగా ఖానాపురం హవేలీలో పూర్తి కాలం కార్యకర్తగా పని చేశారు. మరలా సొంత మండలానికి వచ్చి ఐద్వా మండల కార్యదర్శిగా, ఇల్లందు డివిజన్ అధ్యక్షులుగా, సిపిఎం ఇల్లందు డివిజన్ కమిటీ సభ్యురాలుగా, మేజర్ పంచాయితీ 7 వ వార్డు సభ్యురాలుగా సిపిఎం నుండి గెలిచారు.
ఇటు తండ్రి కుటుంబం, అటు అత్త సుభద్రమ్మ కుటుంబం కమ్యూనిస్టు పార్టీలో పని చేశారు. 1983లో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కె.ఎల్.నరసింహరావు ఆధ్వర్యంలో ఆదర్శ వివాహం చేసుకున్న భర్త ఎ.రామకృష్ణ డివైఎఫ్ ఐ, పి ఎన్ యం, సిపిఎం నాయకులుగా కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ సత్యవతికి తోడ్పాటును అందిస్తున్నారు. సిపియం మండల మొదటి తరం నాయకురాలు అలవాల సుభద్రమ్మ వారసురాలుగా ఉద్యమంలో పని చేస్తున్న సత్యవతి ప్రస్తుతం ఐద్వా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులుగా పని చేస్తూ నూతన మండల కార్యదర్శిగా ఎన్నికైనారు.
మండలంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు అందుబాటులో ఉండి, నిరంతరం వారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పోరాటం చేస్తూ, సిపిఎం మండల కార్యదర్శిగా ఎన్నికైన సత్యవతి నియామకం పట్ల పార్టీ నాయకులు పుర ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.