బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కు వ్యతిరేకంగా గుజ్జుల రామక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొందరు అసమ్మతి నేతలు భేటీ కావడాన్ని పార్టీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. అసమ్మతి పేరుతో పార్టీ ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహించే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైందని బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా విశేషమైన సేవలందించడమే కాకుండా ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలు కీలక పదవిలో కొనసాగుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా సమావేశం పెట్టారనే సమాచారం తెలుసుకున్న పార్టీ జాతీయ నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలతో నివేదిక పంపాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్లు సమాచారం….
ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం అసమ్మతి పేరుతో నిర్వహించిన సమావేశానికి ఎవరెవరు వెళ్లారు? ఈ సమావేశాన్ని నిర్వహించిందెవరు? వీరితోపాటు ఈ సమావేశం వెనుక అసలు ఉద్దేశాలేమిటి? తెరవెనుక ఎవరున్నారు? అనే అంశాలపై ఆరా తీస్తోంది. కరీంనగర్ ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్న నేత ఒకరు బండి సంజయ్ కు వ్యతిరేకంగా అసమ్మతి సమావేశం నిర్వహణకు తెర వెనుక సహకరిస్తున్నట్లు పార్టీ ద్రుష్టికి వచ్చిందని పార్లమెంట్ ఎన్నికలకు ముందు బండి సంజయ్ ఇమేజను దెబ్బతీయడం ద్వారా పార్టీని డిస్ట్రబ్ చేసి లబ్ది పొందాలన్నదే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని భావిస్తున్నారు.
జాతీయ స్థాయిలో ఒకప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సదరు నేతపై అసమ్మతి, ఇతరత్రా ఆరోపణలు రావడంతో జాతీయ నాయకత్వం ఆయనను పూర్తిగా పక్కనపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆయన విషయంలో పూర్తి నెగిటివ్ భావనతో ఉన్నట్లు తెలిసింది. అయితే సదరు నేత రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి కరీంనగర్ లేదా మల్కాజ్ గిరి నుండి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. మల్కాజ్ గిరి టిక్కెట్ ను పార్టీలో చాలామంది సీనియర్ నేతలు ఆశిస్తున్నారు. జాతీయ స్థాయిలో తమకున్న పలుకుబడిని వినియోగించుకుని టిక్కెట్ సాధించుకునే పనిలో ఉన్నారు. ఇది తెలుసుకున్న సదరు నేతలు బండి సంజయ్ ఇమేజ్ ను దెబ్బతీస్తే… కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం టిక్కెట్ సాధించవచ్చనే ప్లానింగ్ లో భాగంగానే అసమ్మతి పేరుతో రాజకీయ మంత్రాంగం నడుపుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు అసమ్మతి పేరుతో క్రమశిక్షణ తప్పి పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్న నేతలపై పార్టీ నాయకత్వం చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. అదే సమయంలో పార్టీ సీనియర్ నేతలు గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, సుగుణాకర్ రావు తీరుపైనా పార్టీ నాయకత్వం ఆగ్రహంతో ఉంది. ఎన్నికల సమయంలో ఉమ్మడి కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఏమాత్రం పనిచేయని ఆయా నేతలు… ఎన్నికల తరువాత పార్టీని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలకు ఒకట్రొండు రోజుల్లో నోటీసులు జారీ చేయడంతోపాటు ఒకరిద్దరిపై వేటు వేయడం ద్వారా పార్టీ నాయకత్వం కట్టుదాటితే సహించేది లేదనే సంకేతాలు పంపాలనే భావనలో ఉన్నట్లు తెలిసింది.