రాష్ట్ర రాజకీయాల్లో సనత్ నగర్ నియోజకవర్గానికి ఎప్పుడూ కీలక పాత్ర ఉంటుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత రాష్ట్ర కేబినెట్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సనత్ నగర్ నుంచే ఎన్నికయ్యారు. అందుకే సనత్ నగర్ నియోజకవర్గాన్ని పవర్ పాలిటిక్స్ కేంద్రంగా చెప్పుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల వారికి నివాసమే కాకుండా పారిశ్రామికవాడ, వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు ఈ నియోజకవర్గం కేంద్రం కావడంతో పట్టు కోసం పార్టీలు పోటీ పడుతూ ఉంటాయి. ఈసారి అధికార పక్షం నుంచి నియోజకవర్గాన్ని చేజిక్కించుకునేందుకు ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రతిపక్షం నుంచి బలమైన అభ్యర్థులు… బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా ఇప్పటి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మూడోసారి కూడా ఆయనే గులాబీ పార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయం స్పష్టమవుతోంది. సొంత పార్టీలో కూడా మంత్రికి ఎదురు నిలవడేవారు లేరు. దీంతో బీఆర్ఎస్ లో టిక్కెట్లకు పోటీ లేదనే చెప్పుకోవాలి. దీంతో మంత్రికి ధీటుగా బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అందుకోసం ప్రముఖులను బరిలో నిలిపేందుకు యత్నిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి దివంగత మర్రి చెన్నా రెడ్డి మనవడు మర్రి ఆదిత్యా రెడ్డి, ప్రముఖ కంటి వైద్యులు రవీందర్ గౌడ్, ప్రముఖ రచయిత్రి, పరిశోధకురాలు డాక్టర్ కోట నీలిమా పేర్లు కాంగ్రెస్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి సీనియర్ నాయకుడు శ్యాంసుందర్ గౌడ్, ఇటీవలే ఆ పార్టీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి, ఆకుల విజయ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీపతి రాజేశ్వర్ రావు కుమారుడు శ్రీపతి సతీష్, మాజీ ఎమ్మెల్యే ప్రసూనల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రతిపక్ష నేతల సామాజిక, ఆర్థిక, కుటుంబ నేపథ్యాలు బలంగా ఉండడం. పోటీకి వారు ఆసక్తి కనబరచడంతో సనత్ నగర్ నియోజకవర్గంలో త్రిముఖ పోరుపై ఇప్పటి నుంచే చర్చలు జోరందుకున్నాయి. ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉండనుంది. పోరుకు పార్టీలు సన్నద్ధం.. ఈసారి రాష్ట్రంలో అధికారం చేపట్టాలని ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్,బీజేపీలు పట్టుదలతో ఉన్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో ఇరు పార్టీలు అధికారపక్షంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సనత్ నగర్ లోని ఆయా పార్టీల నాయకులు,కార్యకర్తలు కూడా జోష్ గా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కోట నీలిమా, మర్రి ఆదిత్యా రెడ్డి తమకే టిక్కెట్ దక్కుతుందనే ధీమాతో ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి పర్యటనలను చేపడుతున్నారు. బిజెపి మర్రి శశిధర్ రెడ్డి ఓటరు లిస్టు అవకతవకలు, ప్రభుత్వ పాలసీల్లోని లోటుపాట్లను ఎత్తి చూపుతున్నారు. శ్యాంసుందర్ గౌడ్, ఆకుల విజయలు స్థానిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. టీడీపీ నేతలు అంతర్గతంగా కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారు. అధికారపక్ష అభ్యర్థిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవంతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో సనత్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం వేడెక్కిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. త్రిముఖ పోరులో ప్రజలెవరికి పట్టం కడతారనేది మాత్రం వేచి చూడాల్సిందేనని అంటున్నారు.
Sanatnagar politics: సనత్ నగర్ పై ప్రముఖుల ఆసక్తి
సనత్ నగర్ లో త్రిముఖ పోరు