Saturday, May 25, 2024
Homeపాలిటిక్స్Sirisilla: వారిద్దరూ కుమ్కక్కై నాపై అభ్యర్ధిని ఇంకా ప్రకటించలే

Sirisilla: వారిద్దరూ కుమ్కక్కై నాపై అభ్యర్ధిని ఇంకా ప్రకటించలే

మోడీకి మద్దతివ్వాలన్న బండి

తనను ఓడించేందుకు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు కుమ్కక్కై కుట్రలు చేస్తున్నాయని, అందులో భాగంగానే నామినేషన్ల పర్వం ప్రారంభమైనా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిని ఇంతవరకు ప్రకటించ లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు విచ్చేసిన బండి సంజయ్ కు గజ మాలతో భారీ స్వాగతం పలికారు. పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

- Advertisement -

కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద నుండి టౌన్ మొత్తం తిరుగుతూ శాంతినగర్ హనుమాన్ ఆలయ సమీపం వరకు ర్యాలీలో పాల్గొన్నారు. బండి సంజయ్ సమక్షంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ధూమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో వందలాది మంది బిఆర్ఎస్ నాయకులు బిజెపిలో చేరారు. వారందరికీ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.

రాముడంటే భక్తి ఉండాలి తప్ప… బిఆర్ఎస్, కాంగ్రెసోళ్లకు రాముడి పేరు వింటేనే భయం పట్టుకుందన్నారు. అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యం అని అవమానపరుస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసిందన్నారు. బిఆర్ఎస్ అరాచకాలపై, అవినీతి, అక్రమాలపై బీజేపీ అలుపెరగని పోరాటాలు చేస్తే కాంగ్రెస్ కు ఓటేయడం ఎంత వరకు న్యాయం ఆలోచించాలని సూచించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి అంతా కేంద్రం ఇచ్చిన నిధులతోనే సాధ్యమైందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదున్నారు. ప్రజలు వాస్తవాలు గమనించి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే నామినేషన్ల పర్వం ప్రారంభమైనా ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్ధిని ప్రకటించనే లేదని, ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై బండి మాటల్లో..

వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం ముమ్మాటికీ బిఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్న బండి సంజయ్ నాటి మంత్రి కేటీఆర్ తాను ప్రతిపాదించిన కొన్ని కంపెనీల వద్దే యార్న్ కొనుగోలు చేయాలని షరతు పెట్టడంతో అధిక ధరకు యార్న్ కొనుగోలు చేసిన నేతన్నలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా.. యార్న్ కొనుగోలులో అక్రమాలపై విచారణ జరపాలని సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లాలో కేటీఆర్, జిల్లా మంత్రి కుమ్కక్కై పనిచేస్తున్నరన్నారు. వస్త్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టారు.. గతంలో కేటీఆర్ ప్రతిపాదించిన కంపెనీల వద్ద మాత్రమే యార్న్ కొనుగోలు చేయాలని నేతన్నలను బలవంత పెడుతూ భారీ ఎత్తున దోపిడీ చేస్తుంటే.. మంత్రి ఎందుకు స్పందించడం లేదు? ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ వ్యవహారంపై విచారణ జరపాలన్నారు.

గతంలో కేసీఆర్, కేటీఆర్ జిల్లాకు వస్త్తుంటే బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి గృహ నిర్బంధానికే పరిమితం చేసేవారని, ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపినా వెనుకాడలే. గత ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై పోరాడి కేసీఆర్ మెడలు వంచి ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడినామన్నారు. వాస్తవాలు ఆలోచించాలని, దేశం కోసం అహర్నిశలు కష్టపడుతున్న మోదీకి మద్దతివ్వండన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని వంద శాతం పోలింగ్ జరిగేలా చూడండి ప్రజలను కోరారు. పువ్వు గుర్తుపై ఓటేసి బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామక్రిష్ణ, ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపీ, ఉపాధ్యక్షుడు శీలం రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News