AUS vs IND: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో (Border – Gavaskar Trophy 2024) భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్‌లో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. ట్రావిస్ హెడ్(152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలతో విరుచుకుపడ్డారు. దీంతో ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 101 ఓవర్లలో 405 పరుగులు చేసింది. క్రీజ్‌లో అలెక్స్ కేరీ (45), మిచెల్ స్టార్క్ (7) ఉన్నారు. ట్రావిస్ హెడ్(152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలు బాదేశారు. భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లతో రాణించాడు.
ఓవర్ నైట్ స్కోర్ 28/0 పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా సాగింది. రెండో రోజు తొలి సెషన్ ఆటలో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తే.. రెండు, మూడు సెషన్లలో ఆస్ట్రేలియా రాణించింది. ఈ క్రమంలో టీ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు234/3 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ విధ్వంసం సృష్టించారు. హెడ్ 115 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు. ట్రావిస్ హెడ్ టెస్టు క్రికెట్‌లో 9వ సెంచరీ సాధించాడు. ఇక మరో ఎండ్‌లో స్మిత్ కూడా సెంచరీతో రాణించాడు. టెస్టుల్లో స్మిత్‌కు 33వ సెంచరీ కావడం విశేషం.