Azam Khan : శ్రీలంక ప్రీమియర్ లీగ్(LPL)లో ఆటగాళ్లు ఫీల్డింగ్ చేస్తూ గాయపడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. మొన్న లంక ఆటగాడు చమిక కరుణతర్నె క్యాచ్ అందుకునే క్రమంలో పళ్లు రాలగొట్టుకోగా.. నేడు బంతిని అందుకునే క్రమంలో పాక్ వికెట్ కీపర్ గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మోయిన్ ఖాన్ కుమారుడు ఆజామ్ ఖాన్ లంక ప్రీమియర్ లీగ్‌లో గల్లే గ్లాడియేటర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సోమవారం రాత్రి గల్లే గ్లాడియేటర్స్, కాండీ ఫాల్కన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గ్లాడియేటర్స్ 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. వికెట్ కీపర్ ఆజామ్ ఖాన్ మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు.
అనంతరం 154 పరుగుల విజయ లక్ష్యంలో బరిలోకి దిగింది కాండీ ఫాల్కన్స్. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 141 పరుగులకు మాత్రమే పరిమితమైంది. 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఇదిలా ఉంటే.. కాండీ ఫాల్కన్స్ ఇన్నింగ్స్ 16 ఓవర్‌లో ఆజామ్ ఖాన్ గాయపడ్డాడు. ఈ ఓవర్‌ను ప్రదీప్ నువాన్ వేశాడు. ఆ ఓవర్‌లో మూడో బంతిని స్లో బాల్‌గా వేసేందుకు యత్నించగా బ్యాట్స్‌మెన్ టచ్ చేయకపోవడంతో వైడ్‌గా వెళ్లింది. బంతిని అంచనా వేయడంతో ఆజామ్ ఖాన్ పొరబాటు పడ్డాడు. బ్యాట్స్‌మెన్ దాటిన తరువాత బంతి సింగిల్ బౌన్స్ అయి అతడి తలను తాకింది.
బాధతో ఆజామ్ ఖాన్ విలవిలలాడిపోయాడు. మైదానంలో అలాగే పడుకుండిపోయాడు. వెంటనే ఫిజియో అక్కడకు వచ్చాడు. స్ట్రైచ్చర్ సాయంతో ఆజామ్ ఖాన్ ను మైదానం బయటకు తీసుకువెళ్లిపోయారు. అక్కడి నుంచి నేరుగా ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్ చేసిన వైద్యులు అంతా నార్మల్‌గానే ఉన్నట్లు చెప్పారని, భయపడాల్సిన అవసరం ఏమీ లేదని గ్లాడియేటర్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉంటే.. ఆజామ్ ఖాన్ తండ్రి మోయిన్ ఖాన్ గల్లేగ్లాడియేటర్స్‌కు హెడ్ కోచ్. ఈ ఘటన జరిగినప్పుడు అతడు అక్కడే ఉన్నాడు. వెంటనే మైదానంలోకి వచ్చాడు. స్ట్రెచర్‌పై తన కుమారుడిని వెలుతున్నప్పుడు ఏం కాదు అని చెబుతూ నవ్వుతూ ఆస్పత్రికి పంపిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.