రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 164 పరుగుల లక్ష్యాన్ని కేవలం 17.5 ఓవర్లలో ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ఆడిన నాలుగు మ్యాచుల్లో నాలుగు విజయాలతో ఆటీమ్ దూసుకుపోతోంది.
ఈ మ్యాచ్ ఆరంభంలో ఢిల్లీ టాప్ ఆర్డర్ పూర్తిగా చేతులెత్తేసినా, కేఎల్ రాహుల్ ఒంటరిగా బాధ్యత తీసుకుని విజయం వైపు జట్టును నడిపించాడు. టాప్ ఆర్డర్‌లోని డూప్లెసిస్ (2), మెక్ గర్క్ (7), పోరెల్ (7) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగినా, రాహుల్ అద్భుతంగా ఆడి 53 బంతుల్లో 93 పరుగులు చేశాడు. ఇందులో 6 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. రాహుల్‌కు ట్రిస్టన్ స్టబ్స్ (38 పరుగులు, 1 సిక్స్, 4 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో ఢిల్లీ సునాయాసంగా విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీయగా, యష్ దయాల్, సుయాష్ శర్మ ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. ఓపెనర్ పిల్ సాల్ట్ 17 బంతుల్లో 37 పరుగులు చేసి దుమ్మురేపాడు. ప్రారంభంలో పవర్‌ప్లేలోనే 53 పరుగులు వచ్చాయి. కానీ సాల్ట్ రనౌట్ అయిన తర్వాత బ్యాటింగ్ క్రమం గందరగోళానికి లోనైంది. విరాట్ కోహ్లీ (22), పటిదార్ (25), లివింగ్‌స్టన్ (4), జితేష్ వర్మ (3) విఫలమయ్యారు. చివర్లో టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 37 పరుగులు – 4 సిక్సులు, 2 ఫోర్లు) సత్తాచాటడంతో స్కోరు మరింత మెరుగుపడింది. ఢిల్లీ బౌలర్లలో విప్రాజ్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయగా, మోహిత్ శర్మ, ముకేష్ కుమార్ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ పాయింట్ల పట్టికలో తన స్థానం బలపడించుకుంది.