FIFA World Cup : ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. తమ తొలి మ్యాచ్ ప్రాన్స్ చేతిలో 1-4 తేడాతో ఘోర ఓటమిని చవిచూసిన ఆసీస్.. శనివారం అల్ జనోబ్ స్టేడియంలో ట్యునిషియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టింది. 1-0 తేడాతో ట్యునిషియా పై విజయం సాధించింది. 12 ఏళ్ల తరువాత ప్రపంచకప్ మ్యాచుల్లో ఆస్ట్రేలియాకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.
ఇరు జట్లు హోరా హోరీగా తలపడగా.. ఆట 23వ నిమిషయంలో ఆస్ట్రేలియా స్ట్రైకర్ మిచెల్ డ్యూక్ హెడర్ గోల్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తరువాత నుంచి ఇరు జట్లు పదే పదే ప్రత్యర్థి జట్ల గోల్ పోస్టులపై దాడులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. నిర్ణీత సమయంలోగా ట్యునిషియా ఒక్క గోల్ కూడా చేయకపోవడంతో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ విజయంలో గ్రూప్-డి నుంచి ఆస్ట్రేలియా రౌండ్ ఆఫ్ -16 ఆశలను సజీవంగా ఉంచుకుంది. అటు ట్యునిషియా మాత్రం తొలి మ్యాచ్ డెన్మార్క్‌తో డ్రా చేసుకోగా, ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ప్రిక్వార్టర్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.