HCA Issue: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)లో జరిగిన అవకతవకలపై ఎన్‌ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ED) ప్రత్యేక దృష్టి సారించింది. ఈ వ్యవహారంలోకి ఈడీ ఎంటర్ కావడం కీలక పరిణామంగా మారింది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై FIR, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలు, ఇతర వివరాలు ఇవ్వాలని సీఐడీకి ఈడీ లేఖ రాసింది. ఈడీ కోరిన వివరాలను సీఐడీ త్వరలోనే ఇవ్వనుంది. సీఐడీ నుంచి వివరాలు అందగానే నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనుంది.
కాగా ఇటీవల జరిగిన ఐపీఎల్ 18వ సీజన్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ , హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య టిక్కెట్ల వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తమకు అదనంగా 10శాతం కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయించాలంటూ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అదనంగా టికెట్లు కేటాయించకపోడంతో వీఐపీల బాక్స్‌కు తాళం వేసి వేధించారంటూ ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం సంచలనంగా మారడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ఇతర సభ్యులు అదనపు టికెట్ల కోసం ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని వేధించారని నిర్థారించారు.
ఈమేరకు ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదిక ఆధారంగా జగన్మోహన్ రావు, హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, హెచ్‌సీఏ సీఈవో సునీల్ కాంటే, చక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు జి.కవితను అరెస్ట్ చేసింది. ఒకేసారి ఐదుగురిని అరెస్ట్ చేయడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిందితులను మల్కాజిగిరి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో నిందితుల్లో కవిత అనే మహిళను చంచల్‌గూడ జైలుకు, మిగిలిన వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.
Also Read: రోహిత్ శర్మకు షాక్.. గిల్కి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు..?
ఇక సీఐడీ దర్యాప్తులో జగన్‌మోహన్ రావు అరాకచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ పత్రాలతో శ్రీచక్ర క్లబ్ ఏర్పాటు చేసినట్లు విచారణలో బయటపడింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కోసం నకిలీ పత్రాలను సృష్టించారని తేలింది. ఈ నకిలీ పత్రాల ద్వారా జగన్ మోహన్ రావు హెచ్‌సీఏలో అధ్యక్షుడిగా పోటీ చేశారని గుర్తించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈడీ ఎంటర్ అవ్వడం తీవ్ర చర్చనీయాంశంమైంది.


