Eng vs Ind 4th Test Day 4 Highlights: ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో గిల్ సేన పోరాడుతోంది. కేఎల్ రాహుల్(87),శుభమాన్ గిల్(78) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ నాలుగో రోజు ఆటముగిసే సమయానికి 63 ఓవర్లలో 2 వికెట్లకు 174 పరుగులు చేసింది. టీమిండియా ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే ఇంకా 137 పరుగులు చేయాల్సి ఉంటుంది. అంతకముందు అతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్ లో 669 పరుగులకు ఆలౌటైంది. దీంతో 311 పరుగుల భారీ ఆధిక్యం ఆ జట్టుకు లభించింది. మూడో రోజు జో రూట్ సెంచరీ చేయగా.. నాలుగో రోజు బెన్ స్టోక్స్(141) శతకం కొట్టాడు. టీమిండియా బౌలర్లలో జడేజాకు నాలుగు వికెట్లు దక్కాయి. ఐదు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే ఇంగ్లండ్ 2-1తో లీడ్ లో ఉంది.
షాకిచ్చిన వోక్స్..
నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. లంచ్ కు ముందే యశస్వి జైస్వాల్ , సాయి సుదర్శన్ లను డకౌట్ చేసి టీమిండియాకు షాకిచ్చాడు క్రిస్ వోక్స్. దీంతో పరుగులేమీ చేయకుండానే మన జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. హ్యాట్రిక్ తీయాలన్న వోక్స్ కల నెరవేరకుండా చేశాడు గిల్. ఆ తర్వాత రాహుల్ తో కలిసి ఇంగ్లీష్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. వికెట్ ను కాపాడుకుంటూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. టీ విరామం వరకు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.
Also Read: Yuzvendra Chahal – కపిల్ షోలో క్రికెటర్ల సందడి
గిల్, రాహుల్ హాఫ్ సెంచరీలు..
టీ విరామం తర్వాత క్రీజులో నిలదొక్కుకున్న వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాట్ ఝలిపించారు. తొలుత గిల్ అర్ధ సెంచరీ సాధించగా.. ఆ తర్వాత రాహుల్ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఈ క్రమంలో వీరిద్దరూ 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరో వికెట్ పడకుండా నాలుగో రోజు ఆటను ముగించారు. ఆదివారం వీరిద్దరూ వీలైనంత సేపు క్రీజులో ఉండి మ్యాచ్ ను డ్రా గా ముగించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 358 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.


