మరో రెండు రోజుల్లో పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టును పాక్‌కు పంపించేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో ఐసీసీ ఈ టోర్నమెంట్ ను హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఆడే మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. భారత్ తమ దేశానికి రాకపోవడంపై గుర్రుగా ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది.
కరాచీ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న ఎనిమిది దేశాల్లో ఏడు దేశాల జెండాలను ఉంచిన పీసీబీ.. భారత జెండా(Indian Flag)ను మాత్రం ఉంచలేదు. దీనిపై భారత అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. భారత్‌ను మరోసారి పాకిస్థాన్ అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారత జట్టు మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది కాబట్టి భారత జెండాను ఉంచలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 దేశాలు తలపడనున్నాయి. నాలుగేసి జట్లు రెండు గ్రూపులుగా పోటీ పడనున్నాయి. లీగ్ స్టేజ్‌లో ప్రతి జట్టు మూడేసి మ్యాచ్‌లు ఆడుతాయి. రెండు గ్రూపుల్లో టాప్ 2 జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి.