ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ధర్మశాల స్టేడియంలో ఆడుతున్న ఈ మ్యాచ్ అర్ధాంతరంగా రద్దవడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆట కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా స్టేడియంలోని ఫ్లడ్ లైట్లు ఆఫ్ కావడంతో స్టేడియం చీకటిలో మునిగిపోయింది. భద్రతా పరంగా ఇది తీవ్రమైన ఇబ్బందిగా భావించిన అధికారులు వెంటనే మ్యాచ్‌ను నిలిపివేశారు. ప్రేక్షకులకు వెంటనే స్టేడియం ఖాళీ చేయాలంటూ అధికారుల నుంచి సూచనలు రావడంతో వారంతా గందరగోళంగా బయటకు పరుగులు తీశారు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా తలెత్తుతున్న బ్లాక్‌అవుట్ల నేపథ్యంలో మరింత ఉత్కంఠ రేపుతోంది. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భారత సరిహద్దు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో ముందస్తు భద్రత చర్యలలో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు సమాచారం. ధర్మశాల స్టేడియంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. మ్యాచ్ నిలిపివేసే సమయానికి పంజాబ్ కింగ్స్ జట్టు 10.1 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య అద్భుత ఆటతీరుతో కేవలం 25 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదగా, ప్రభుసిమ్రన్ సింగ్ 28 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. శ్రేయస్ అయ్యర్ 0 పరుగుల వద్ద క్రీజులో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ దుష్మంత చమీర ఒక్క వికెట్ సాధించాడు.
ఈఘటనపై స్పందించిన బీసీసీఐ, మ్యాచ్ రద్దుకు కారణమైన అసౌకర్యానికి మన్నించమంటూ ప్రేక్షకులను కోరింది. ఆటగాళ్లు, సిబ్బంది భద్రతకు ముందు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది. ఈ ఘటన మరోసారి దేశ భద్రతా పరిస్థితుల ప్రభావం క్రీడాపై ఎలా పడుతుందో రుజువు చేసింది. అభిమానుల ఆశలు అర్ధంతరంగా ఆగిపోవడమే కాకుండా, భవిష్యత్తులో జరగబోయే మ్యాచ్‌లపై అనిశ్చితిని కూడా కలిగిస్తోంది.