వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడమే కష్టం. ఇక ట్రిపుల్ సెంచరీ అంటే ఊహించడం కూడా కష్టమే. జట్టు స్కోర్ 350 దాటితేనే గొప్ప అని భావిస్తాం. అలాంటిది ఓ ప్లేయర్ ఏకంగా 300కు పైగా పరుగులు చేయడం ఊహించగలమా..? కానీ ఇది నిజంగానే జరిగింది. భారత యువ మహిళ బ్యాటర్ ఇరా జాదవ్(Ira Jadhav) ట్రిపుల్ సెంచరీతో సంచలనం సృష్టించింది. అది కూడా 14 ఏళ్ల వయసులో కావడం విశేషం. మహిళల అండర్ – 19 టోర్నీలో ముంబై జట్టు తరపున ఆడుతున్న ఇరా.. మేఘాలయతో జరిగిన మ్యాచులో 157 బంతుల్లోనే 42 ఫోర్లు, 16 సిక్సర్లతో 346 పరుగులు చేసింది. దీంతో వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి మహిళా భారత క్రికెటర్‌గా ఇరా జాదవ్ అవతరించింది
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 50 ఓవర్లలో 563/3 పరుగులు భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలో దిగిన మేఘాలయ జట్టు కనీసం పోరాటం కూడా చేయకుండానే చేతులెత్తేసింది. కేవలం 19 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ముంబై జట్టు 544 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై బౌలర్లలో జీయా 3, యయాతి 3, రితికా 2, అక్షయ 2 వికెట్లు తీశారు.