OG Records First Day Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మేనియాతో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. గురువారం థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డుల మోత మోగిస్తోంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఏకంగా రూ.75 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా రేపు (గురువారం) థియేటర్లలో సందడి చేయనుంది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గురువారం విడుదల కావాల్సిన ఈ సినిమా బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. అంతకుముందే అంటే ఈరోజు (సెప్టెంబర్ 24) రాత్రి 09 గంటలకే ప్రీమియర్ షోల ద్వారా ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ గా సేల్ అయ్యాయి. ట్రేడ్ వెబ్‌సైట్ Sacnilk నివేదిక ప్రకారం, OG సినిమా ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 75 కోట్లు వసూలు చేసింది. ఇందులో భారతదేశంలో రూ. 45 కోట్లు, విదేశాల్లో రూ. 30 కోట్లు రాబట్టింది.
పవన్ కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్?
పవన్ కళ్యాణ్‌కు అద్భుతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.. ఫస్ట్‌డే ఓపెనింగ్స్‌లో మాత్రం వెనుకబడ్డాడు. ఈ విషయంలోనే పవన్ ఫ్యాన్స్ ఫీలయ్యేవారు. కానీ, ఇప్పుడు ఓజీ ద్వారా ఆ సరదాను కూడా తీర్చుకోనున్నడు పవన్ కళ్యాణ్. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఓజీ సినిమా పవన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ గత సినిమా హరిహర వీరమల్లు మొదటి రోజే రూ. 67 కోట్లు రాబట్టగా, OG మాత్రం ఆ రికార్డును తేలికగా బ్రేక్ చేయబోతోంది. మొత్తంగా OG ఓపెనింగ్ డే కలెక్షన్లు రూ. 150 కోట్ల వరకు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. అంటే, ఫస్ట్ డే ఓపెనింగ్స్‌లో రూ. 100 కోట్లు దాటిన మొదటి పవన్ కల్యాణ్ సినిమాగా రికార్డుకెక్కనుంది. ఇది పవన్ నటించిన భీమ్లా నాయక్ (2022) లైఫ్‌టైమ్ కలెక్షన్ అయిన రూ.158 కోట్లకు చాలా దగ్గరగా ఉండడం విశేషం. ఈసారి ఓజీ ఆ రేంజ్‌ను కూడా దాటే అవకాశముంది.
Also Read: https://teluguprabha.net/news/og-movie-tickets-benefit-shows/
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో..
ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాకు సుజీత్ దర్శకత్వం వహించగా, DVV ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించింది. పవన్ ఇందులో ఓజస్ గంభీర్ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. అతనికి విరుద్ధంగా నడిచే క్రైం బాస్ ‘ఒమీ భౌ’ పాత్రలో ఇమ్రాన్ హష్మీ కనిపించబోతున్నారు. ఈ చిత్రంతో ఆయనకు ఇది తెలుగు డెబ్యూట్ కూడా. హీరోయిన్‌గా ప్రియాంక మోహన్, అలాగే ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బీజీఎం ఇప్పటికే ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది. 14 ఏళ్ల తర్వాత పవన్ సినిమాకు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికేట్ ఇచ్చింది. 2011లో వచ్చిన ‘పంజా’ తర్వాత ఇది ఆయన నటించిన మరో గ్యాంగ్‌స్టర్ డ్రామా కావడం విశేషం. ఇప్పటికే ట్రైలర్, పాటలు, పోస్టర్లు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసిన OG, విడుదలకు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది.


