BSNL Launches India’s Pioneer SIM-Free 5G : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్‌ఎల్) టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. దేశంలోనే తొలిసారిగా సిమ్ రహిత ‘క్వాంటమ్ 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ’ (Q-5G) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ సేవలు, భవిష్యత్ ఇంటర్నెట్ కనెక్టివిటీకి దిశానిర్దేశం చేయనున్నాయి.
సిమ్ రహిత క్యూ-5జీ సేవలు ప్రారంభం : బీఎస్ఎన్‌ఎల్ సిమ్ అవసరం లేని ‘క్వాంటమ్ 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్’ (FWA) సేవలను ప్రవేశపెట్టింది. ఈ సేవలు ప్రారంభ దశలో హైదరాబాద్ నగరంలో పరిమిత స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఫైబర్ నెట్ తరహాలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడమే ఈ క్యూ-5జీ సేవలు లక్ష్యం.
దేశవ్యాప్త విస్తరణ ప్రణాళికలు : తొలివిడతగా హైదరాబాద్‌ను ఎంచుకున్న బీఎస్ఎన్‌ఎల్, 2025 సెప్టెంబరు నాటికి ఈ సిమ్ రహిత 5జీ సేవలను బెంగళూరు, పుదుచ్చేరి, విశాఖపట్నం, పుణె, గ్వాలియర్, చండీగఢ్ వంటి మరిన్ని ప్రముఖ నగరాలకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందించింది.
సేవలు ప్రారంభించిన బీఎస్ఎన్‌ఎల్ సీఎండీ : ఈ ప్రతిష్టాత్మక ‘క్వాంటమ్ 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ’ సేవలను బీఎస్ఎన్‌ఎల్/ఎంటీఎన్ఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ఎ.రాబర్ట్ జె.రవి జూన్ 18న హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ బీఎస్ఎన్‌ఎల్ ఎక్స్ఛేంజ్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్‌ఎల్ బోర్డు డైరెక్టర్లు, తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం), కేంద్ర టెలికాం శాఖ ఉన్నతాధికారులు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు.
మరిన్ని వివరాల కోసం: వినియోగదారులు క్వాంటమ్ 5జీ సర్వీసుల పూర్తి వివరాల కోసం www.bsnl.co.in లేదా www.telangana.bsnl.co.in వెబ్‌సైట్లను సందర్శించవచ్చు. ప్రత్యామ్నాయంగా, సమీపంలోని బీఎస్ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించవచ్చు.
అద్భుతమైన వేగం, ఆకర్షణీయమైన ప్లాన్‌లు : క్యూ-5జీ సేవలు అమీర్‌పేట్ ప్రాంతంలో అసాధారణమైన వేగాన్ని అందిస్తున్నాయి. కేవలం 10 మిల్లీ సెకన్లలోనే 980 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్, 140 ఎంబీపీఎస్ అప్‌లోడ్ స్పీడ్‌ను ఈ సేవలు అందించగలవని బీఎస్ఎన్‌ఎల్ తెలిపింది. ఇది అల్ట్రా హెచ్‌డీ టీవీలను చూడటానికి, వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవడానికి, క్లౌడ్ గేమింగ్‌కు అత్యంత అనుకూలంగా ఉంటుంది.
నెలవారీ ప్లాన్‌ల వివరాలు :
రూ.999 ప్లాన్: 100 ఎంబీపీఎస్ స్పీడ్
రూ.1,499 ప్లాన్: 300 ఎంబీపీఎస్ స్పీడ్
సిమ్ రహిత కనెక్టివిటీ ఎలా పనిచేస్తుంది : ఈ సిమ్ రహిత కనెక్టివిటీ బీఎస్ఎన్‌ఎల్ టవర్ గ్రిడ్‌ను ఉపయోగించుకొని, నేరుగా వినియోగదారుల ఇళ్లలోకి వైర్‌లెస్ రేడియో వేవ్ ఇంటర్నెట్ బీమ్‌లను పంపిస్తుంది. దీని ద్వారా ఎటువంటి ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అవసరం లేకుండానే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇంటికి చేరుతుంది. బీఎస్ఎన్‌ఎల్ అందించే ప్రత్యేక గేట్‌వే డివైజ్‌లో యూజర్లు కేవలం ప్లగ్ ఇన్ చేస్తే సరిపోతుంది. హైదరాబాద్‌లోని దాదాపు 85 శాతం ఇళ్లను తమ టవర్ గ్రిడ్ కవర్ చేస్తుందని, వారంతా ‘క్వాంటమ్ 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ’ సర్వీసులను పొందవచ్చని బీఎస్ఎన్‌ఎల్ వెల్లడించింది.
‘క్వాంటమ్ 5జీ’లోని కీలక ఫీచర్లు : ఆత్మనిర్భర్ భారత్ మిషన్: సిమ్ రహిత ‘క్వాంటమ్ 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ’ (Q-5G) టెక్నాలజీని ‘ఆత్మనిర్భర్ భారత్’ మిషన్‌లో భాగంగా భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించారు.
స్వదేశీ టెక్నాలజీ: దీనికోసం ప్రత్యేకమైన రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ (RAN), కామన్ ప్లాట్‌ఫామ్ ఎన్యుమరేషన్ (CPE)లను తయారు చేశారు. వాటన్నిటిని కలిపి సిమ్ లేకుండా పనిచేసే ‘క్వాంటమ్ 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ’ టెక్నాలజీని ఆవిష్కరించారు.
నెట్‌వర్క్ స్లైసింగ్, ఎడ్జ్ కంప్యూటింగ్, అల్ట్రా రిలయబుల్ లో లేటెన్సీ కమ్యూనికేషన్ (URLLC) వంటి ఫీచర్లతో కూడిన ‘5జీ ఎస్‌ఏ కోర్’ అనేది Q-5G సర్వీసుల్లో ఉందని బీఎస్ఎన్‌ఎల్ పేర్కొంది. ఎంఎస్ఎంఈలు (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు), స్మార్ట్ తయారీ క్లస్టర్ల కోసం ప్రత్యేక ఇంటర్నెట్ కనెక్షన్లను అందించగలమని బీఎస్ఎన్‌ఎల్ తెలిపింది.
భారతీయ ఇంజనీర్ల ఘనత : బీఎస్ఎన్‌ఎల్/ఎంటీఎన్ఎల్ సీఎండీ ఎ.రాబర్ట్ జె.రవి ప్రకారం, క్వాంటమ్ 5జీ సేవలు భారతీయ ఇంజినీర్ల ప్రపంచస్థాయి సృజనాత్మకతకు నిదర్శనం. ఇది బీఎస్ఎన్‌ఎల్ కోసం పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన తొలి సిమ్ రహిత ఇంటర్నెట్ సర్వీస్. హైదరాబాద్‌లో పరిమిత విడుదలతో ప్రారంభమైన ఈ సేవలు, టెకీలు, టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నాయి. యూజర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా దేశంలోని ఇతర నగరాలకు Q-5G విస్తరణ, ఫీచర్ల అప్‌గ్రేడ్ బీఎస్ఎన్‌ఎల్ లక్ష్యంగా ఉంది.