Sam Altman Warns AI Could Replace 40% Jobs By 2030: కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – AI) ప్రపంచ కార్మిక శక్తిని ఊహించిన దానికంటే వేగంగా మార్చేయగలదని, 2030 నాటికి ఏకంగా 40 శాతం ఉద్యోగాలు దీని బారిన పడవచ్చని OpenAI CEO సామ్ ఆల్ట్‌మన్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ దశాబ్దం ముగిసేలోపే AI ‘సూపర్ ఇంటెలిజెన్స్’ స్థాయికి చేరుకోవచ్చని, అంటే మనుషులను మించిన తెలివితేటలు సాధించవచ్చని ఆయన అన్నారు.
బెర్లిన్‌లోని ఆక్సెల్ స్ప్రింగర్ గ్లోబల్ రిపోర్టర్స్ నెట్‌వర్క్‌లో మాట్లాడిన ఆల్ట్‌మన్, ప్రస్తుతం మనుషులు చేస్తున్న పనులలో కేవలం 1% మాత్రమే AI చేస్తోందని, కానీ రాబోయే కొన్నేళ్లలో ఇది 30 నుంచి 40 శాతానికి చేరుకోవచ్చని తెలిపారు.
ALSO READ: WiFIi Internet: మీ ఇంట్లో వైఫై స్లో అవుతుందా..?ఈ టిప్స్‌తో ఇంటర్నెట్ వేగం పెంచుకోండిలా!
వేగంగా మారనున్న ఉద్యోగ ప్రపంచం
చరిత్రలో ఎప్పుడూ ఉద్యోగాలు మారుతూనే ఉన్నాయని, ప్రతి 75 ఏళ్లకు సమాజంలోని సగం ఉద్యోగాలు మారిపోతాయనే లెక్క ఉందని ఆల్ట్‌మన్ గుర్తుచేశారు. అయితే, ఇప్పుడు ఈ పరివర్తన చాలా వేగంగా జరగబోతుందని ఆయన నొక్కి చెప్పారు. “GPT-5 ఇప్పటికే నాకంటే, చాలా మంది కంటే తెలివైనదిగా ఉంది,” అని ఆయన చేసిన వ్యాఖ్య చర్చనీయాంశమైంది.
ఈ సాంకేతిక పురోగతి సైన్స్, టెక్నాలజీకి ఒక గొప్ప మైలురాయి అయినప్పటికీ, దీని వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాల కోత తప్పదని ఆయన హెచ్చరించారు. ఒకవైపు, మనుషులు సాధించలేని కొత్త ఆవిష్కరణలు, పరిష్కారాలు AI తీసుకురాగలదు. మరోవైపు, మానవులు చేస్తున్న పనులలో సింహభాగాన్ని AI తీసేసుకుంటే సామూహికంగా ఉద్యోగాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. “ఈ దశాబ్దం చివరికి, మనుషులు చేయలేని పనులను చేయగలిగే అత్యంత సామర్థ్యం గల మోడల్స్ (AI) లేకపోతే నేను చాలా ఆశ్చర్యపోతాను,” అని ఆయన స్పష్టం చేశారు.
ఏ ఉద్యోగాలు భర్తీ అవుతాయి? ఏవి సురక్షితం?
గత వారం ‘ది టక్కర్ కార్ల్సన్ షో’లో ఆల్ట్‌మన్ మాట్లాడుతూ, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ (కోడింగ్) మరియు కస్టమర్ సర్వీస్ వంటి రంగాలలో ఉద్యోగాలు ముందుగా AI ద్వారా భర్తీ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో, కొన్ని పాత్రలు ప్రత్యేకంగా మానవులకు మాత్రమే పరిమితమై ఉంటాయని చెప్పారు. “కంప్యూటర్ ప్రోగ్రామర్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేను. కానీ నర్సుల వంటి ఉద్యోగాలు మాత్రం అంతగా ప్రభావితం కావని నేను విశ్వసిస్తున్నాను,” అని ఆయన అన్నారు. AI తీసుకొచ్చే ఈ పెను మార్పులకు సమాజం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
ALSO READ: UPI Fraud : ఫోన్ పోయిందా? క్షణం ఆలస్యం చేసినా ఖాతా ఖాళీ!


