AIMIM Asaduddin Owaisi: హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య నడుస్తున్న త్రిముఖ పోరు ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠను పెంచుతోంది. బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా.. లేక కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వంపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందా.. మరి గ్రేటర్‌లో బీజేపీ సత్తా చాటుతుందా.. అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఈ క్రమంలో ఈ పోటీ నుంచి ఎంఐఎం పార్టీ తప్పుకొంది. కాగా, ఈ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపబోదని AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఉద్ఘాటించారు. పదేళ్లపాటు జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నా.. అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధిని చూసి మాత్రమే నియోజకవర్గంలోని ప్రజలు ఓటేయాలని హితవు పలికారు.
“మరికొన్ని రోజుల్లో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల ద్వారా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాదు. లేదా ప్రభుత్వం మారే అవకాశం కూడా లేదు. పదేళ్లపాటు ఈ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆయన దానిని సద్వినియోగం చేసుకోలేదు. అక్కడ ఏ వార్డులోనూ అభివృద్ధి జరగలేదు. ప్రజలు ఇక్కడ అభివృద్ధిని చూసి మాత్రమే ఓటేయాలి.’ అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
ఎంఐఎం పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టడం లేదని అసదుద్దీన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి, యువ నాయకుడు నవీన్ యాదవ్‌కు జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడేళ్ల పాటు అధికారంలో ఉంటుందని.. ఈ ఉప ఎన్నిక ద్వారా ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు జరగబోవని వెల్లడించారు. 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు, జూబ్లీహిల్స్‌లో AIMIM నిర్ణయాలు వెల్లడిస్తుందని వివరించారు.


