Bullet in Passenger Bag: హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే మూసాపేట మెట్రో స్టేషన్‌లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శనివారం రాత్రి ప్రవేశ ద్వారం వద్ద లగేజ్ స్కానింగ్ సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/revanth-reddy-talks-about-dharani-portal-brs/
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన మహ్మద్ అనే యువకుడు హైదరాబాద్‌లో ప్రగతినగర్‌లో నివసిస్తూ ఓ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి మెట్రో రైలు ఎక్కేందుకు మూసాపేట స్టేషన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో టికెట్ తీసుకున్న అనంతరం మహ్మద్ ఎంట్రీ వద్ద లగేజీ స్కానింగ్ కోసం తన బ్యాగును యంత్రంలో పెట్టాడు. అయితే మిషన్‌లో బీప్ శబ్దం రావడంతో అందులో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించిన భద్రతా సిబ్బంది.. వెంటనే అప్రమత్తమైంది. బ్యాగును తనిఖీ చేయగా, అందులో 9 ఎంఎం బుల్లెట్ ఒకటి కనిపించింది.
షాక్‌కు గురైన భద్రతా సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మహ్మద్‌ను అదుపులోకి తీసుకుని కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. బుల్లెట్ యువకుడి వద్దకు ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, ప్రయాణికుడి వద్ద బుల్లెట్ దొరకడంతో మెట్రో స్టేషన్లలో భద్రతా ఏర్పాట్లపై ఆందోళన వ్యక్తమైంది.


