ED Raid: గొర్రెల పంపిణీ పథకం అవకతవకలపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) బుధవారం హైదరాబాద్‌లో దాడులు నిర్వహించింది. మాజీ మంత్రి ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన లెక్కలు తారుమారైనట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం ఎనిమిది చోట్ల, మాజీ అధికారుల నివాసాలు, మధ్యవర్తులతో పాటు ప్రధాన అనుమానితుల ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తుంది.
ఈ కేసుకు సంబంధించి ఆర్థిక మోసాలకు సంబంధించిన మనీ లాండరింగ్ అంశాలపై అధికారులు దృష్టి సారించారు. అధికారికంగా నిబంధనలకు విరుద్ధంగా లబ్ధిదారుల వివరాలు, రవాణా ఇన్వాయిసులు, చెల్లింపులు వంటి అనేక అంశాల్లో అవకతవకలు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లినట్లు తేలింది. అంతే కాకుండా లబ్ధిదారులుగా చేర్చిన వారిలో కొంతమంది చనిపోయినట్లు వెల్లడైంది. అంతే కాకుండా కొన్ని ప్రదేశాల్లో నకిలీ వాహన నంబర్లతో ఇన్వాయిసులు తయారు చేయడం వంటివి గుర్తించారు. వీటితో పాటు గొర్రెలకు డూప్లికేట్ ట్యాగ్స్ ఇచ్చిన ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇప్పటివరకు నమోదైన ఎఫ్ఐఆర్లలో రూ.2.1 కోట్లు ఉండగా.. కాగ్ ఆడిట్ ప్రకారం అన్ని జిల్లాలు కలిపి రూ.253 కోట్లకు పైగా నష్టం జరుగిందని తేలింది. మొత్తంగా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.


