New ration cards for Hyderabad people: హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నగరం, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని పౌరులకు కొత్తగా 76,939 తెల్ల రేషన్‌కార్డులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. ఇవి వచ్చే మూడు రోజుల్లో లబ్ధిదారులకి పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఈ కొత్త కార్డుల ద్వారా దాదాపు 4.74 లక్షల మందికి లబ్ధి కలగనుందని అంచనా వేయబడింది.
ఇతర వివరాల ప్రకారం, ఈ కార్డులకోసం అదనంగా 2,704 టన్నుల సన్నబియ్యాన్ని కేటాయించాల్సి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు నెలల కొరకు రేషన్ పంపిణీ ఇప్పటికే పూర్తైనప్పటికీ, వచ్చే నెలల్లో బియ్యం పంపిణీ ఎలాంటి విధంగా జరగనుందో అధికారిక స్పష్టత ఇంకా రాలేదు. ఆగస్టులో కొత్తగా మంజూరైన కార్డులకు తక్షణమే బియ్యం ఇవ్వనున్నారా? లేకపోతే అన్ని కార్డుదారులకూ సెప్టెంబర్‌లో పంపిణీ చేస్తారా? అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. కొత్త లబ్ధిదారులు సరైన సమయానికి రేషన్‌ను అందుకోవాలన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. అటు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు మంజూరు అయినా వ్యక్తులకు రేషన్ కార్డుల పంపిణీ నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఈ పంపిణీ కొనసాగుతోంది. త్వరలోనే హైదరాబాద్ ప్రజలకు కూడా కొత్త రేషన్ కార్డులు అందనున్నాయి.


