Sunday, November 16, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్High-Speed Rail : దూసుకురానున్న బుల్లెట్ రైళ్లు.. తెలుగు రాష్ట్రాల మధ్య దూరం తరిగిపోనుందా?

High-Speed Rail : దూసుకురానున్న బుల్లెట్ రైళ్లు.. తెలుగు రాష్ట్రాల మధ్య దూరం తరిగిపోనుందా?

Hyderabad bullet train project :  గంటల తరబడి సాగే రైలు ప్రయాణం.. నడుం పట్టేసే ప్రయాస.. ఇక గతం కానున్నాయా..? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజల చిరకాల స్వప్నమైన బుల్లెట్ రైలు కూత పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరులతో పాటు దేశ ఆర్థిక రాజధాని ముంబైని కలుపుతూ హైస్పీడ్ రైలు కారిడార్ల ఏర్పాటుకు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ రైళ్లు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తే, 12 గంటల ప్రయాణం కేవలం 3 గంటలకు తగ్గిపోనుంది. 

- Advertisement -

ముంబయి మార్గం.. ముందంజలో : హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు ప్రతిపాదించిన మూడు ప్రధాన కారిడార్లలో, హైదరాబాద్-ముంబయి మార్గం ఒక అడుగు ముందుంది. ఈ మార్గానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ఇప్పటికే సిద్ధమై రైల్వే బోర్డుకు చేరింది. ఈ డీపీఆర్‌లో మొత్తం 11 స్టేషన్లను ప్రతిపాదించగా, అందులో రెండు స్టేషన్లు (హైదరాబాద్, జహీరాబాద్) తెలంగాణ పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఈ కారిడార్ సుమారు 170 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం లభించిన వెంటనే భూసేకరణ, నిధుల మంజూరు వంటి కీలక ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి.

చెన్నై, బెంగళూరులకు రూట్ మ్యాప్ కసరత్తు : మరోవైపు, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై, బెంగళూరులను కలిపే రెండు వేర్వేరు హైస్పీడ్ కారిడార్ల కోసం తుది ఎలైన్‌మెంట్ సర్వే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రైల్వే అనుబంధ సంస్థ ‘రైట్స్’ ఈ సర్వే బాధ్యతలను నిర్వహిస్తోంది. హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లే మార్గం కోసం ప్రధానంగా రెండు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు.

జాతీయ రహదారి 65 వెంట: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి సమీపంగా మార్గాన్ని నిర్మించడం.

నల్గొండ మీదుగా: ప్రస్తుతం ఉన్న నల్గొండ రైల్వే లైన్‌కు అనుసంధానంగా కొత్త మార్గాన్ని ప్రతిపాదించడం. కాజీపేట మీదుగా వెళ్లే మార్గం దూరం ఎక్కువ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవడంతో, పైన పేర్కొన్న రెండు మార్గాలలో ఒకదాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసినప్పుడు ఈ ప్రాజెక్టులపై చర్చించినట్లు సమాచారం.

గ్రీన్ ఫీల్డ్ విధానం.. గంటకు 350 కి.మీ. వేగం : ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్లతో సంబంధం లేకుండా, ఈ బుల్లెట్ రైలు కారిడార్లను పూర్తిగా కొత్త మార్గంలో ‘గ్రీన్ ఫీల్డ్’ నమూనాలో నిర్మించనున్నారు. ఈ ట్రాక్‌లపై కేవలం బుల్లెట్ రైళ్లు మాత్రమే నడుస్తాయి. గంటకు గరిష్టంగా 350 కిలోమీటర్లు, సగటున 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్నారు. దీనివల్ల, ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చెన్నై లేదా బెంగళూరుకు పట్టే 12-13 గంటల ప్రయాణ సమయం కేవలం 3 గంటలకు తగ్గిపోతుంది. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే హైదరాబాద్ నుంచి ముంబయి, చెన్నై, బెంగళూరుతో పాటు మార్గమధ్యంలో ఉన్న కర్నూలు, విజయవాడ, గుంటూరు వంటి నగరాలకు కూడా ప్రయాణం సులభతరం కానుంది. ఇది విద్య, ఐటీ, వ్యాపార రంగాల విస్తరణకు దోహదపడుతుందని రైల్వే వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad