Hyderabad School Fee Regulation : ఒకప్పుడు బడిపంతులు అంటే భక్తి… ఇప్పుడు బడి ఫీజులంటే భయం. అక్షరాలు దిద్దించడానికే ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురిస్తోందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా నగరాల్లోని కార్పొరేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చేసి, సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ పాఠశాలలో నర్సరీ ఫీజు వివరాలు బయటకు రావడంతో తల్లిదండ్రులు నివ్వెరపోతున్నారు. ఇంతకీ ఆ స్కూల్ ఎక్కడుంది..? ఆ ఫీజుల వ్యవహారంపై సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చేంటి..? ప్రభుత్వ నియంత్రణ ఎంతవరకు రానుంది..?
వైరల్ అయిన ఫీజుల చిట్టా :హైదరాబాద్‌లో పిల్లలకు అ, ఆ, ఇ, ఈ నేర్పించడానికి అయ్యే ఖర్చు నెలకు అక్షరాలా రూ. 21,000! వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఈ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్న విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ టెడ్ఎక్స్ స్పీకర్ అనురాధ తివారీ ఈ ఫీజుల వ్యవహారాన్ని బయటపెట్టడంతో, ఈ అంశం కార్చిచ్చులా వ్యాపించింది. దీంతో నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి.
మధ్యతరగతి మంటలు: ఈ ఫీజుల మోతపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.”ఈ డబ్బుతో ఓ మధ్యతరగతి కుటుంబం ఏడాది పాటు బతుకుతుంది కదా” అని ఒకరు ఆవేదన వ్యక్తం చేయగా, “విద్య ఎప్పుడో వ్యాపారంగా మారిపోయింది, ఇది దానికో నిదర్శనం” అని మరొకరు వ్యాఖ్యానించారు.”పిండి కొద్దీ రొట్టె.. ఆ ఫీజుకు తగ్గట్టే అక్కడ ప్రమాణాలు ఉంటాయి. స్తోమత ఉన్నవారే పంపండి” అని ఇంకొకరు వాదించడం గమనార్హం.
ఈ పరిణామం విద్య కేవలం విజ్ఞానానికి కాకుండా, ఓ సామాజిక హోదాకు చిహ్నంగా (స్టేటస్ సెంటర్‌గా) మారిపోయిందన్న విమర్శలకు బలం చేకూరుస్తోంది. పిల్లల ఫీజులు కట్టడానికే తల్లిదండ్రుల సంపాదన మొత్తం సరిపోతుండటంతో, వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ప్రభుత్వ నియంత్రణకు అడుగులు : ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల ఫీజులపై నియంత్రణ అత్యవసరమనే డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించి, పర్యవేక్షించేందుకు “తెలంగాణ ఫీజు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్” బిల్లును తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఈ బిల్లు సమీక్ష దశలో ఉంది. ఈ చట్టం అమల్లోకి వస్తే, తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపే మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని ఆశిస్తున్నారు.
ఒకప్పటి చరిత్ర.. నేటి వాస్తవం : ఫీజుల వివాదంలో చిక్కుకున్న ఈ పాఠశాలకు ఘనమైన చరిత్రే ఉంది. 1965లో స్థాపించబడిన ఈ విద్యాసంస్థ, ఒకప్పుడు నామమాత్రపు ఫీజుతో అత్యుత్తమ విద్యను అందించేదని పేరుగాంచింది. కానీ కాలక్రమేణా పరిస్థితులు పూర్తిగా మారిపోయి, నేడు సామాన్యుడికి అందని ద్రాక్షలా మారిందని పలువురు పూర్వ విద్యార్థులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.


