Kavitha Comments on BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇవాళ ఆమె బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రెండు నెలలు ఆగి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాక స్థానిక ఎన్నికలు పెడితే నష్టమేంటని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. తమ పోరాటం అంతా బీసీ రిజర్వేషన్లపైనే అని స్పష్టం చేశారు. బీసీల అంశంపై బీఆర్ఎస్ పార్టీ సీరియస్‌గా ఫోకస్ చేయడం లేదని ఆరోపించారు. తనకు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకూడదనే విధంగా ఈటల మాట్లాడుతున్నారని,మహారాష్ట్రలో ఎన్నికలు రద్దు అయినట్లుగానే తెలంగాణలోనూ రద్దవుతాయని ముందే చెబుతున్నారని, ఇది సరైన విధానం కాదని ఆక్షేపించారు. కోర్టులను తప్పుదోవ పట్టించేలా ఈటల రాజేందర్ వ్యాఖ్యలు ఉన్నాయని.. ఆ మాటలు ఈటల సొంతంగా మాట్లాడారా లేక బీజేపీ పార్టీ చెప్పించిందా అని కామెంట్ చేశారు. ఈ విషయంలో ఈటల రాజేందర్ బీసీలకు క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.
జీవో ఇచ్చి అనుచరులతో కేసు వేయించారు..
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన బతుకమ్మ సంబురాలకు చింతమడక నుంచి లండన్ వరకు మహిళలు బ్రహ్మరథం పట్టారని కవిత అన్నారు. అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ తెలంగాణ తల్లిపై గత సర్కార్ గెజిట్ ఇవ్వలేదని విగ్రహ రూపు రేఖలు పూర్తిగా మార్చి గెజిట్ ఇచ్చి ఆన్లైన్లో పెట్టారని ఆరోపించారు. ఎన్నడూ జై తెలంగాణ అనని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బతుకమ్మ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం ఆహ్వానించదగిన విషయమని అన్నారు. గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రభుత్వం బతుకమ్మ సంబురాలు చేసింది అంతేతప్ప బతుకమ్మ పండుగపై ప్రేమతో కాదన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని చాటేందుకు బతుకమ్మ సంబురాలను నిర్వహించిన ఘటన ఒక్క కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. కాంగ్రెస్ 42 బీసీ రిజర్వేషన్లపై జీవో విడుదల చేసి.. వారే తమ అనుచరులతో తెల్లారే కోర్టులో కేసు వేయించారని, ఈ విషయంపై సోషల్ మీడియా కోడై కూస్తోందన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు విడుదల చేసిన రిజర్వేషన్లు గందరగోళంగా ఉన్నాయని, కొన్ని గ్రామాల్లో అస్సలు లేని సామాజికవర్గాలకు రిజర్వేషన్లు కేటాయించారని కామెంట్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన డేటాను బయట పెడితే.. రిజర్వేషన్లపై స్పష్టత వస్తుందని అభిప్రాయపడ్డారు.


