Doctor Prathyusha Died: ఈ మధ్య సోషల్ మీడియా పరిచయాలు ఎక్కువగా అనర్థాలకు దారి తీస్తున్నాయి. ఎక్కడో ఆన్‌లైన్‌లో మొదలయ్యే ఈ పరిచయాలు చివరకు వ్యక్తుల ప్రాణాలను చిదిమేస్తున్నాయి. కుటుంబ బాధ్యతలు తెలిసిన కొందరు ఇలాంటి ట్రాప్‌లలో పడకుండా ఉంటున్నారు. అయితే మరికొందరు మాత్రం వీటిని విస్మరించడం వల్ల కాపురాలు కూలిపోతున్నాయి. అంటువంటి ఘటనే వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. తన భర్త వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని తట్టుకోలేక పోయిన ఓ వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడింది. వరంగల్ నగరంలోని హసన్‌పర్తిలో నివసిస్తున్న ప్రత్యూష తన భర్త సృజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ ఇన్‌ఫ్లూయెన్సర్‌తో చనువుగా ఉండటం జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి తనువు చాలించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆమె భర్త సృజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.
అసలేం జరిగిందంటే?: ప్రత్యూష, సృజన్ ఇద్దరూ వైద్యవృత్తిలో ఉన్నప్పుడే ప్రేమించుకున్నారు. అనంతరం వీరి ప్రేమ కాస్త వివాహ బంధంగా మారింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవల సృజన్‌కు వరంగల్‌కు చెందిన ఓ ఇన్‌స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్‌తో పరిచయం ఏర్పడింది. పబ్లిసిటీ కార్యక్రమాల్లో ఒక్కటైన ఇద్దరి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసినట్లు సమాచారం. దీంతో సృజన్ తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా ప్రత్యూషను విడాకుల పేరుతో బెదిరించడం మొదలుపెట్టాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది ఫాలోవర్లు ఉన్న ఆ యువతితో షికార్లు, సినిమాలు, ఇతర కార్యక్రమాలకు వెళ్లడం వంటివి ప్రత్యూష తట్టుకోలేకపోయింది. ఇకనైన భర్త మారిపోతాడని ఆమె ఆశించింది. అయితే భర్త తన తీరు మార్చుకోక పోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన ప్రత్యూష చివరకు బలవన్మరణానికి పాల్పడింది.
ఇదే విషయమైన తాము ఎన్నిసార్లు చెప్పినా సృజన్, అతని తల్లిదండ్రులు కూడా స్పందించలేదని వారి వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందిన వారు వాపోయారు. ఈ ఘటనకు కారణమైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుని తమ కూతురికి న్యాయం చేయాలని ప్రత్యూష తండ్రి కోరారు.
చర్యలు తీసుకోవాలి: వైద్యురాలి మరణం వరంగల్‌లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది. మంచి వృత్తిలో కొనసాగుతూ వేరొక మహిళ మోజులో డి తన భార్యను దూరం పెట్టి ఆమె మృతికి కారణమైన వైద్యుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో ఇది నిజంగా ఆత్మహత్య లేక హత్యా అనే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.


