రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. మహాశివ రాత్రి సందర్భంగా పాలకుర్తిలో నిర్వహించే ఉత్సవాల ఏర్పాట్లపై కూడా మంత్రి ఈసందర్భంగా సమీక్ష చేశారు.
సగటు పౌరుడికి అవసరమైన అన్నిసదుపాయాలను కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు ఎర్రబెల్లి. బిడ్డ కడుపులో పడ్డప్పటి నుండి మనిషి మరణానంతరం వరకు అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రజల హెల్త్ ప్రొఫైల్ ని కూడా రెడీ చేస్తున్నామని, ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్టుగా ములుగులో చేపట్టి విజయవంతం చేశామన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ కంప్యూటరీకరణ చేసి, అత్యవసర పరిస్థితుల్లోనూ నిమిషాల్లో వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్త్రీ నిధి సహకారంతో రాష్ట్రంలో మొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలో 5.10 కోట్లతో 3,000మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఎర్రబెల్లి.