Nampally Court| హీరో నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ(Konda Surekha) చేసిన వ్యాఖ్యలపై సీనియర్ హీరో నాగార్జున(Nagarjuna), మాజీ మంత్రి కేటీఆర్(KTR) నాంపల్లి కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన న్యాయస్థానం.. తాజాగా మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణకు కొండా సురేఖ తరపున న్యాయవాది గురుమిత్ సింగ్ హాజరయ్యారు. అయితే న్యాయమూర్తి సెలవులో ఉండటంతో ఇంఛార్జ్ న్యాయమూర్తి తదుపరి విచారణను నవంబర్ 13కు వాయిదా వేశారు.
కాగా కొన్ని రోజుల క్రితం నాగార్జున కుమారుడు హీరో నాగచైతన్య(Nagachaitnya), సమంత(Samanta) విడాకుల విషయంపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్ వల్లే చైతన్య, సమంత విడిపోయారంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. సురేఖ వ్యాఖ్యలను తెలుగు ఇండస్ట్రీ మొత్తం తీవ్రంగా ఖండించింది. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరూ ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నాగార్జున ఆమెపై రూ.100కోట్ల పరువునష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవం, ప్రతిష్ట దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఇక తన పరువుకు కూడా భంగం కలిగిచారంటూ కేటీఆర్ కూడా నాంపల్లి న్యాయస్థానంలో పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు.