అనువుకానీ చోట అధికులం కాదని అనుకున్నారో ఏమో కాని ఒకప్పుడు పాణ్యం ఎమ్మెల్యేగా అత్యధిక ప్రజాభిమానంతో ఒక వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథి రెడ్డి, బనగానపల్లె, కోవెలకుంట్ల రాజకీయాల్లో బ్రాండ్ అంబాసిడర్ చల్లా కుటుంబ కోడలు జడ్పిటిసి చల్లా శ్రీలక్ష్మిలు ఈ ఎన్నికల్లో ఎక్కడ అగుపడటం లేదు. 1999లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి 2004 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికి ఈ ప్రాంతంలో రాజకీయ పట్టున్న నాయకునిగా ఇప్పటికి చెక్కుచెదరని అభిమానం కలిగిన నాయకునిగా మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథి రెడ్డి పేరు చెప్పవచ్చు.
2024 ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు కూడా బిజ్జం పేరు నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉంటాడని ఊహాగానాలు పెద్దఎత్తున వినవచ్చాయి. అయితే నోటిఫికేషన్ రావడం, ఆయా పార్టీల అభ్యర్థుల పేర్లు ఖరారు కావడం , నామినేషన్ ల ప్రక్రియ కూడా పూర్తి కావడం జరిగినప్పటికి బిజ్జం జాడ మాత్రం ఈ ఎన్నికల్లో కనపడటం లేదు. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర కలిగిన దివంగత చల్లా రామకృష్ణా రెడ్డి కుమారుడు చల్లా భగీరథరెడ్డి సతీమణి జడ్పిటిసి చల్లా శ్రీలక్ష్మి సైతం ప్రచారం ఊసే లేకుండా మిన్నకుండటం విశేషం. ఎన్నికల నోటిఫికేషన్ రాకమునువు చల్లా శ్రీలక్ష్మి పేరు సైతం బనగానపల్లె వైపిసి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తాయి. తర్వాత ఏం జరిగిందో కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఆమె ఎక్కడకూడా ప్రచారంలో కనపడటం లేదు. పోలింగ్ మే 13 న ఉండటం మరో రెండువారాలు మాత్రమే ఎన్నికల ప్రచారం ఉండటంతో ఈలోగా వీరు తాము అభిమానించే లేదా తాము నమ్మే పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రచారంలో పాల్గొని తమవంతు కృషి చేస్తారా లేదా అన్నది వేచిచూడాలి.