బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కేటీఆర్ స్పష్టంగా చెప్పారని, 2014 నుండి సీఎం కేసిఆర్ పలు మార్లు మోడీని కలిసి అడిగారంటూ బీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. కేంద్ర ప్రభుత్వం అదానీ కి లాభం చేకూర్చే విధంగా చర్యలు చేస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం కోసం కేసిఆర్ కృషి చేస్తున్నారని మాలోత్ కవిత, మంత్రి పువ్వాడ అజయ్, మరో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మీడియాకు వివరించారు. బయ్యారం ఉక్కు గురించి ఒక్క మాట కూడా కాంగ్రెస్ మాట్లాడటం లేదని వారు వాపోయారు. బండి సంజయ్ ఎలక్షన్ ముందు రాజకీయాలు చేస్తున్నారని, పేపర్ లీకేజీ విషయం లో బీ ఆర్ ఎస్ పై కుట్రలు చేస్తున్నారని వీరు ముగ్గురూ మండిపడ్డారు. కచ్చితంగా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పై అన్ని పార్టీలు కలిసి రావాలని, అందరం కలిసి వెళ్తే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధించవచ్చని కవిత, రవిచంద్ర, పువ్వాడ అన్నారు. తెలంగాణ విభజన చట్టంలో తెలంగాణలో, ఏపిలో వేర్వేరు స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టాలని కేంద్రం చెప్పిందని వారు ముగ్గురూ ప్రెస్ మీట్ లో గుర్తుచేస్తూ మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐరన్ గనులు నిక్షేపంగా ఉన్నాయని, అక్కడ ఐరన్ ఓర్ గనులు లేవని మళ్ళీ కేంద్రం అంటోందన్నారు.