భారతదేశానికి కీలకమైన ఫార్మాస్యూటికల్ పరిశ్రమపై అమెరికాప్రతిపాదించిన టారీఫ్‌లు(America Tarrifs) ఆందోళనకరంగా ఉన్నాయని హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకులు, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి(Parthasaradhi Reddy) తెలిపారు. ఈ అంశంపై ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ అమెరికా ప్రభుత్వం విధించిన సుంకాలు అమలుచేస్తే ఫార్మా పరిశ్రమకు తీవ్రమైన ఆర్థిక నష్టాలు మిగులుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2023-24 నాటికి 30 లక్షలకు పైగా భారతీయుల ఉద్యోగ భద్రతకు ముప్పు పొంచి ఉందని వాపోయారు. ఏడాదిలో ఇండియా, అమెరికాకు సుమారు 9 బిలియన్ డాలర్ల (రూ.74,000 కోట్లు) విలువైన ఔషధ ఉత్పత్తులను ఎగుమతి చేసిందన్నారు. ఎగుమతులు వేగంగా పెరుగుతున్న సమయంలో పన్నుల పెంపు ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు.
భారత ఔషధ ఎగుమతుల్లో దాదాపుగా అమెరికా వాటా 31శాతంగా ఉందని వివరించారు. ఇది భారత ఫార్మా పరిశ్రమకు కీలకమైన మార్కెట్ కావడం వల్ల ఈ ప్రతిపాదిత టారిఫ్ అమలైతే ఫార్మా పరిశ్రమపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ట్యాక్స్ పెంపుతో భారత ఔషధ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో మరింత ఖరీదవుతాయన్నారు. దీంతో మన దేశ ఔషధ కంపెనీలకు అమెరికా మార్కెట్ వాటా గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందన్నారు. ప్రత్యేకించి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే సాధారణ ఔషధాల (జనరిక్ మెడిసిన్స్) లాభదాయకత తగ్గిపోవచ్చని చెప్పుకొచ్చారు. భారత ఔషధ పరిశ్రమ భారతదేశ జీడీపీకి విదేశీ మారకద్రవ్యానికి కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. ఈ టారిఫ్ ప్రతిపాదన వల్ల విదేశీ మారకద్రవ్య ఆదాయం తగ్గిపోవచ్చని ఆయన తెలిపారు. దాంతోపాటు తయారీ, పరిశోధన, పంపిణీలలో లక్షాలది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. ఈ అంశాన్ని అత్యంత ప్రాముఖ్యతతో పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని ఓ శాస్త్రవేత్తగా, రాజ్యసభ సభ్యునిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని పార్థసారథి రెడ్డి వెల్లడించారు.
పరిష్కార మార్గాలు:
ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పార్థసారథి రెడ్డి పలు సూచనలు చేశారు. ఈ సూచనలను అమలు చేస్తే భారత ప్రభుత్వం భారత ఔషధ ఉత్పత్తులపై అమెరికా పరస్పర టారిఫ్ ప్రభావం తగ్గించి, ఔషధ పరిశ్రమను రక్షించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
- అమెరికాకు ఔషధ ఉత్పత్తుల ఎగుమతి ప్రాముఖ్యతను వివరిస్తూ, పరస్పర టారిఫ్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో వివరించాలి.
ఉదాహరణకు ఔషధ ధరలు పెరగడం, ప్రాణరక్షక ఔషధాల అందుబాటులో సమస్యలు రావడం మొదలైనవి. - అమెరికాతో ఉచిత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలి.
- అమెరికా-భారతీయ వాణిజ్య విధాన సమాఖ్యను పునఃసమీక్షించి, టారిఫ్ వంటి వాణిజ్య సమస్యలను పరిష్కరించేందుకు మరింత ప్రభావవంతంగా ఉపయోగించుకోవాలి.
- భారత ఔషధ పరిశ్రమకు మద్దతు అందించడం – ప్రత్యేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, పన్ను మినహాయింపులు లేదా ఇతర ప్రయోజనాలను అందించాలి.
- భారత ఔషధ సంస్థలను కొత్త వ్యూహాలను రూపొందించేందుకు ప్రోత్సహించడం – ఆటోమేషన్ ద్వారా కార్యకలాపాల సమర్థతను పెంచడం, ఖర్చులను తగ్గించడం, పరిశోధన, అభివృద్ధిలో మరింత దృష్టి సారించాలి.
- ప్రపంచ స్థాయిలో పోటీ చేయగల ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు పరిశోధన, అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక మద్దతు అందించడం.