2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ ఓడిపోయిన నాటి నుంచి కేసీఆర్(KCR) ఫామ్‌మౌస్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే. ఆడపాదడపా ఫామ్‌హౌస్‌లోనే పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ఇటీవల త్వరలోనే భారీ బహిరంగసభ ద్వారా ప్రజాక్షేత్రంలోకి వస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈనెల 19వ తేదీన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రకార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని(BRS Party Meeting) నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఫిబ్రవరి 19వ తేదీ మధ్యాహ్నం ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జులు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.