మూసీ నది (Musi River) ప్రక్షాళనపై ప్రత్యేక ద్రుష్టి సారించిన సర్కార్ ఓ ఫ్యాక్టరీకి భారీ ఝలక్ ఇచ్చింది. కలుషిత వ్యర్ధాలను అక్రమంగా నదిలోకి విడుదల చేస్తున్న రుద్ర టెక్నాలిజీస్ మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (టిజిపిసిబి) అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
వివరాల్లోకి వెళితే… నవంబర్ 26 అర్ధరాత్రి ఒకటిన్నర ప్రాంతంలో AP 28 TD 4699 నెంబర్ గల ట్యాంకర్ నదిలోకి వ్యర్ధాలను వదులుతుండటం దృష్టికి వచ్చిన రాజేంద్రనగర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనపై సీఆర్.నెం.1157/2024 యు/ఎస్.280, 125 బిఎన్‌ఎస్ ద్వారా కేసు నమోదు చేసిన పోలీసులు టిజిపిసిబి అధికారులకు సమాచారం ఇచ్చారు.
టిజిపిసిబి అధికారులు వ్యర్ధాలను వదిలిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంత నీరు, కలుషితమైన మట్టి నుండి నమూనాలను సేకరించారు. బాపు ఘాట్ వంతెన సమీపంలో మూసీ నది పక్కన ఇసుక, కంకర మెటల్ ట్రేడింగ్ సైట్ ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఆ ఆవరణలో లారీల పార్కింగ్ స్థలం నుండి పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసి ఉండడాన్ని గమనించారు. పైప్‌లైన్ నుంచి ట్యాంకర్ల ద్వారా మూసీ నదిలోకి వ్యర్థాలను విడుదల చేస్తున్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు.
అనంతరం రాజేంద్రనగర్ పోలీసులను సంప్రదించిన టిజిపిసిబి అధికారులు.. ట్యాంకర్ కి సంబంధించిన వివరాలు సేకరించారు. ట్యాంకర్ సంగారెడ్డి జిల్లాలోని రుద్ర టెక్నాలజీస్ (Rudra Technologies) పరిశ్రమ (గతంలో M/s. శ్రీనివాస ల్యాబ్స్) కి చెందినదని తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే కలుషిత వ్యర్ధాలను ట్యాంకర్స్ సహాయంతో బాపూఘాట్ వంతెన సమీపంలో మూసీ నదిలోకి అంటే హైదర్‌గూడ, అత్తాపూర్, రాజేంద్రనగర్ (M), రంగారెడ్డి జిల్లా లో రహస్యంగా విడుదల చేస్తున్నట్లు తెలుసుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి విధించిన CFO షరతులను కూడా ఈ పరిశ్రమ పాటించట్లేదని అధికారులు తేల్చారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కాలుష్య నియంత్రణ మండలి ఈరోజు రుద్ర టెక్నాలజీస్ పరిశ్రమ మూసివేతకి ఉత్తర్వును జారీ చేసింది.
మూసీ నది (Musi River) ప్రక్షాళన బాపూఘాట్ నుంచే…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రారంభించింది. ఒకప్పుడు తాగునీటిని అందించిన మూసీ నది కలుషిత వ్యర్ధాలు కలిసి మురికి కూపంలా తయారైంది. ఇప్పుడు మూసీ ప్రక్షాళన చేపడితే భాగ్యనగరానికి మణిహారంలా మారుతుందని కాంగ్రెస్ సర్కార్ యోచిస్తోంది. ఈ క్రమంలో మూసీ పునరుజ్జీవంలో భాగంగా మొదటి విడతలో బాపూఘాట్ కేంద్రంగా చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఇప్పటికే సింగపూర్ కి చెందిన మెయిన్హార్ట్ కన్సార్షియం ప్రణాళికను సిద్ధం చేసింది.
అయితే, అధికారులు బాపూఘాట్ కి ఎగువన 10 కి.మీ, మూసీ నది దిగువన 5 కి.మీ కలిపి మొత్తం 15 కి.మీ మేర సుందరీకరణ పనులు చేపట్టాలని, నదిలో మురుగునీరు కలవకుండా 37 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించాలని ప్రతిపాదించింది. కానీ అక్కడ పరిస్థితులు మాత్రం వేరేలా ఉన్నాయి. కొంతమంది యథేచ్ఛగా నదిలోకి వ్యర్ధాలను వదులుతున్నారు. దీంతో వారిని అరికట్టేందుకు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (టిజిపిసిబి) అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.