హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గ్రీన్ ఫార్మా సిటీ ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఇన్ఫ్రాస్ట్క్రక్షర్) శ్రీనివాసరాజు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శషాంక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలో ముచ్చర్ల ప్రాంతంలో ఇప్పటికే ఎంపిక చేసిన పరిసరాల్లో గ్రీన్ ఫార్మా సిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు.
పర్యావరణ హితంగా కాలుష్య రహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిశ్రమల అభివృద్ధి జరగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
అక్కడ అభివృద్ధికి అవసరమైన రోడ్లు, తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీలు, తదితర మౌలిక సదుపాయాల నిర్మాణాలను వీలైనంత తొందరగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని, వాటికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఉండాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని పనులు చేయాలని సూచించారు.
గ్రీన్ ఫార్మా సిటీలో పెట్టుబడులకు ఇప్పటికే పేరొందిన ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నాయని, త్వరలోనే ఆ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతామని సీఎం తెలిపారు.
ఔషధాల తయారీ కంపెనీలు, బయోటెక్ & లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కొత్తగా నెలకొల్పే అత్యాధునిక గ్రీన్ ఫార్మా సిటీ సింగిల్ స్టాప్ గా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయ పడ్డారు.
యాంటీ బయాటిక్స్, ఫెర్మంటేషన్ ఉత్పత్తులు, సింథటిక్ డ్రగ్స్, రసాయనాలు, విటమిన్లు, వ్యాక్సిన్లు, డ్రగ్ ఫార్ములేషన్స్, న్యూట్రాస్యూటికల్స్, హెర్బల్ ఔషధ ఉత్పత్తులు, ప్రత్యేక రసాయనాలు, కాస్మోటిక్స్ తదితర సంబంధిత ఉత్పత్తులన్నింటికీ ఫార్మా సిటీలో ప్రాధాన్యముంటుందని చెప్పారు.
వీటితో పాటు పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని అన్నారు. పరిశోధన, శిక్షణ, నైపుణ్యాలకు అవసరమైన ప్రత్యేక విశ్వ విద్యాలయం ఉంటుందని అన్నారు. హెల్త్ కేర్, ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా అందులో కోర్సులు నిర్వహించాలని సూచించారు.
గ్రీన్ ఫార్మా సిటీ లో భూములు కోల్పోయిన వారికి గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.